ప్రజాశక్తి-తాడేపల్లి : పట్టణంలోని సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణానదిలో శుక్రవారం ఈతకు దిగిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. పట్టణంలోని డోలాస్ నగర్‌కు చెందిన డేరంగుల శంకర్ (19), డేరంగుల కృష్ణయ్య (17) మరో నలుగురితో కలిసి కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. వీరంతా సీతానగరం రైలు బ్రిడ్జి వద్ద నదిలోకి దిగారు. శంకర్, కృష్ణయ్య ప్రమాదవశాత్తు లోతైన సుడిగుండాల్లో చిక్కుకోగా గమనించిన మిగతా నలుగురు కాపాడాలంటూ పెద్దగా కేకలు పెట్టారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. వెంటనే గల్లంతైన వారి తల్లిదండ్రులకు మిగతావారు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులతో ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులిద్దరి తల్లుల అక్కాచెల్లెళ్లు, తండ్రులు అన్నాదమ్ములు కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంఇ. మృతుడు శంకర్ కూలీ పనులకు వెళ్తుండగా కృష్ణయ్య తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డేరంగుల జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈత సరదా గాల్లో కలుస్తున్న ప్రాణాలు
కృష్ణానదిలో ఈత కొట్టాలనే సరదా ఈ ప్రాంత యువకుల ప్రాణాలు గాల్లో కలిపిపోవడానికి కారణమవుతోంది. ఈ నాలుగు నెలల కాలంలోనే అటు విజయవాడ నగరం, ఇటు తాడేపల్లిలో 16 మంది యువకులు మృత్యువాతపడ్డారు. అయినా నదిలో ప్రమాదసూచికలు ఏర్పాటు చేయలేదు. గతంలో తాడేపల్లి పోలీసులు మూడు ప్రాంతాల్లో సీతానగరం వైపు పుష్కర ఘాట్ల వద్ద, రైలు బ్రిడ్జి వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఒక దశలో నదిలో ఎవరూ వెళ్లకుండా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రమాద సూచిక బోర్డులను, కంచెను లెక్క చేయకుండా వాటిని తొలగించుకుని యువకులు నదిలోకి వెళ్లి ఆటలాడుతున్నారు. ఆ తరువాత సరదాగా ఈత కొట్టాలని నదిలోకి దిగి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. మరిన్ని ప్రాణాలు నీట కరగక మునుపే పోలీసులు గతంలో మాదిరి పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి : సిపిఎం
కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతిచెందడం పట్ల సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ఆవేదన వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు సానూభూతి తెలిపారు. కృష్ణానదిలో ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటుతో పాటు గతంలో వేసిన మాదిరిగా ముళ్లకంచె వేయాలని పోలీసులను కోరారు. పోలీసు అవుట్‌పోస్టు దగ్గర నిఘా పెట్టినట్లు సీతానగరం పుష్కర ఘాట్లు, రైలుబ్రిడ్జి దగ్గర కూడా యువకులు నదిలోకి వెళ్లకుండా నిఘా పెట్టాలని కోరారు.










