Feb 26,2023 22:39

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌ 

ఆక్వా డెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 23వ కృష్ణా రివర్‌ క్రాసింగ్‌ జాతీయ స్థాయి ఈతల పోటీలను ఆదివారం నిర్వహించారు. పోటీలను పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్‌ఎ వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. తాడేపల్లి లోటస్‌ ఫుట్‌ సిటీ నుంచి నది అవతల ఉన్న విజయవాడ దుర్గాఘాట్‌ వరకు జరిగిన ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి 415 మంది ఈతగాళ్లు పాల్గొన్నారు. 11 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ ఈతల పోటీలలో పాల్గొన్నారు. వయసు ఆధారంగా ఐదు గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహించారు. పోటీల్లో బాలుర విభాగంలో మైహోం అధినేత రామేశ్వరరావు మనవడు భవస్వరూపరావు విజేతగా నిలిచాడు. 31-45 సంవత్సరాల విభాగంలో ఎన్‌టిఆర్‌ జిల్లా స్విమ్మర్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌) మోతుకూరి తులసి చైతన్య విజేతగా నిలిచారు. అనంతరం జరిగిన సభలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఆక్వా డెవిల్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ గోకరాజు గంగరాజు విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కాంతిరాణా మాట్లాడుతూ పోటీల్లో పురుషులతో పాటు మహిళలూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణా రివర్‌ క్రాసింగ్‌ ఈతల పోటీలను నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారిని అభినందించారు. ఈ కార్యక్రమం ఎఆర్‌ ఎడిసిపి కె.శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్‌ ఎసిపి ఎన్‌.వి.రమణమూర్తి గారు, విజయవాడ పశ్చిమ డివిజన్‌ ఎసిపి కె.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.