
పులిచింతల : పులిచింతల డ్యాం 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయిన కారణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రకాశం బారేజీకి ఆకస్మిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు ఎగువకు చేరుకోవాలని సూచించారు.
పులిచింతల డ్యాంలో ఊడిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేకపోతే ఈ ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశాలున్నాయి. దీంతో నీటిని ప్రకాశం బ్యారేజీ వైపుకు మళ్లిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి సుమారు 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో నీరు చేరుకోనుంది. దీంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ దృష్ట్యా అధికారులు, లోతట్టు ప్రాంత ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది.