Oct 17,2023 23:03

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
కృష్ణాజిల్లాలో సాగునీటి కొరత లేదని కలెక్టర్‌ పి.రాజాబాబు స్పష్టం చేశారు. మంగళవారం మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలో ఓటర్‌ జాబితాల సమగ్ర సవరణ, నవీకరణ సాగునీటి సమస్యలు, పాఠశాల కళాశాల విద్యార్థులలో ఎనీమియా నివారణకు తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ కాలువలకు ఎప్పుడు సాగునీరు ఇస్తారో తెలియక రైతులు అపోహ పడుతున్నారని అన్నారు. కాలువ శివారు ప్రాంతాలలో సాగునీటి సమస్య అధిగమించేందుకు సాగునీటి సరఫరా రెగ్యులేట్‌ చేయాలన్నారు. ఏ కెనాల్స్‌కు ఏ తేదీలలో సాగునీటి సరఫరా ఉంటుందో స్టేట్మెంట్‌ తయారుచేసి సమాచారం ముందుగా సంబంధిత అధికారులకు, రైతులకు చేరేలా చూడాలన్నారు. ఒక కుటుంబంలోని ఓట్లన్ని ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్‌ జాబితాలన్నీ క్షేత్రస్థాయిలో బిఎల్వోలు సరిగా వెరిఫై చేయాలని, ప్రతివారం ప్రగతి సమీక్షిస్తామని అన్నారు. క్షేత్ర స్థాయిలో సరిగా వెరిఫికేషన్‌ నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా పాఠశాల, కళాశాల విద్యార్థులలో ఎనీమిక్‌ వారిని గుర్తించాలని, ఎనీమియా నివారణకు వారికి రెగ్యులర్‌గా ఆహారం తీసుకునే సమయంలో మెడిసిన్‌ ఇవ్వాలన్నారు.
మచిలీపట్నం రూపురేఖలు మార్చాలి
నగరాన్ని తలపించేలా మచిలీపట్నం రూపు రేఖలు మార్చి సుందరంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ నగరంలోని వారి చాంబర్లో మేయర్‌ చిటికెన వెంకటేశ్వరమ్మతో కలసి మునిసిపల్‌ అధికారులు, ముడా అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్‌ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేయుటలో మేయర్‌ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మచిలీపట్నంలో సాయంత్రం ఆవులు, గేదెలు రహదారులపై ఉంటూ వాహనాల రాకపోకలకు చాలా అంతరాయం కలిగిస్తున్నాయన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం శిల్పులతో చర్చించి విద్యుత్‌ దీపాలు, ముఖ్యమైన కూడళ్లను మెరుగుపరుచుట వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మచిలీపట్నంలో మురుగునీటి వ్యవస్థ సరిగాలేదని, దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాన రహదారుల్లో కొన్ని ఆక్రమణలు ఉన్నాయని వాటన్నిటిని తొలగించి, వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు కాలువల్లో పూడిక చేయాలన్నారు. మూడు స్తంభాల కేంద్రం నుండి బైపాస్‌ రహదారి మీదుగా లక్ష్మీ టాకీస్‌ వరకు ఉన్న రహదారులు మొదట సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఆర్డిఓ శివ నారాయణ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రయ్య, ముడా విసి రాజ్యలక్ష్మి, మునిసిపల్‌ ఈఈ పి.శ్రీకాంత్‌, సహాయ నగర ప్లానర్‌ మల్లికార్జున, ముడా ప్రణాళిక అధికారి శాంతిలత, జూనియర్‌ ప్రణాళిక అధికారి సుజనా కుమారి పాల్గొన్నారు.
ఈవిఎంల తనిఖీ
కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌లో ఈవీఎంలు, వివిప్యాట్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెక్‌ (ఎఫ్‌ఎల్‌సి) ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈవీఎంల ఫస్ట్‌ లెవెల్‌ తనిఖీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరగాలని, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఐడి కార్డులు లేకుండా ఇతరులను లోనికి అనుమతించరాదని, మొబైల్‌ ఫోన్లు లోనికి అనుమతించకూడదని, భద్రతా అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ పర్యవేక్షకులు డిపిఓ నాగేశ్వర నాయక్‌, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.