Jun 07,2023 23:25

ప్రజాశక్తి-గుంటూరు, తాడేపల్లి : కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ పరిధిలోని ఆయకట్టు సాగునీటికి, ప్రజల త్రాగునీటి అవసరాల కోసం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం తాడేపల్లిలోని కృష్ణా బ్యారేజి, హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, మంగళగిరి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జూన్‌ నెల చివరిలోగానీ, జులై ప్రారంభంలోగానీ నీరు విడుదల చేసే వారని, కానీ గతేడాది నుంచి జూన్‌ ప్రారంభంలోనే నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల త్వరగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభించటానికి, రైతులు మూడు పంటలు పండించటానికి అవకాశం దక్కుతుందని అన్నారు. ముందుగానే పంటలు పండించుకోవటం వల్ల గాలులు, వానలు, తుపానులు సంభవించడానికి ముందే పంటలు ఇళ్లకు చేర్చుకోవడం జరుగుతుందన్నారు. కష్ణా బ్యారేజీలో 3 టీయంసీల నీరు నిల్వ వుందని, పులిచింతల ప్రాజెక్టులో 34 టీయంసీల నీరు పుష్కలంగా వుందని చెప్పారు. కష్ణా డెల్టాకు కావాల్సిన నీరు సమద్ధిగా వుండడం వలన పట్టీసీమ నుండి నీటిని తీసుకురావలసిన అవసరం రాలేదని, అందువల్ల రైతులు త్వరగా నారుమడులు వేసుకొని పంటలు పండించాలని కోరారు. గతేడాది పంటలు ముందుగా పండించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. నాగార్జున సాగర్‌ నుండి నీటిని విడుదల చేయకుండానే పులిచింతల ప్రాజెక్టులో వున్న నీటినే వాడుకోవచ్చన్నారు. అవసరమైన పక్షంలో నాగార్జున సాగర్‌ నుండి కూడా నీరు విడుదలకు అవకాశం వుందని భావిస్తున్నట్లు తెలిపారు. హనుమంతరావు మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వకు సాగు, తాగు నీటి అవసరాలకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారన్నారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల పెంచడానికి అవకాశం వుందని తెలిపారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సి.నారాయణరెడ్డి, గుంటూరు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్‌ ఉమామహేశ్వరరావు, విజయవాడ పర్యవేక్షక ఇంజినీర్‌ శేషం తిరుమలరావు, కార్యనిర్వాహక ఇంజినీర్‌ మల్లికార్జున, ఎంవికె ప్రసాద్‌, జలవనరుల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.