Nov 19,2023 22:35

ప్రజాశక్తి - భట్టిప్రోలు
కృష్ణా జలాల పున పంపిణీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఒను తక్షణమే విరిమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20, 21తేదీలలో విజయవాడలో జరిగే 30గంటల నిరసన దీక్షను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు గొట్టుముక్కల బాలాజీ, బండారు శ్రీనివాసరావు కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిరసన దీక్ష వాల్ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాలపై తక్షణమే సర్వే నిర్వహించాలని కోరారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల నీటిని కేటాయించగా దానిలో ఏపీకి విభజన అనంతరం 512 టీఎంసీలు, తెలంగాణకు 290టీఎంసీలు నీటిని కేటాయించబడ్డాయని అన్నారు. దీనిలో మిగులు జలాల వినియోగంపై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుండగా బిజెపి ప్రభుత్వం దానిపై నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ సమయంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ కనీసం నోరెత్తి మాట్లాడలేదని అన్నారు. కృష్ణా జలాల పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా, రాష్ట్రంలోని కరువు మండలాలకు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో తలపెట్టిన 30గంటల నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.