ప్రభుత్వ సహాయం అందక, ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో జబ్బును సకాలంలో గుర్తించి మందులు వాడలేకపోతున్నారు. దాంతో వ్యాధి తీవ్రత మరింత పెరిగిపోతోంది. మూఢనమ్మకాలను పోగొట్టి, వైద్యపరంగా ప్రజలను చైతన్యపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌భవ, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, గిరిజన అభివృద్ధి పథకాలు ఇలా ఎన్నో వున్నా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి. సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటూ, ప్రజలకు కనీసం వైద్య సౌకర్యం కూడా కల్పించకపోవడం పాలకులకే అవమానం.
కిడ్నీ వ్యాధి అనగానే శ్రీకాకుళం జిల్లా లోని ఉద్దానం గుర్తుకు వస్తుంది. కృష్ణా జిల్లా లోని ఏ.కొండూరు మండలం తదితర ప్రాంతాలు మరో ఉద్దానంగా మారాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత నెల రోజుల లోనే ఈ మండలంలో 11 మంది కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడ్డారు. సిపిఎం బృందం ఈ మండలంలో పరిశీలించగా ఏ గ్రామం, ఏ గిరిజన తండా చూసినా కిడ్నీ వ్యాధిగ్రస్తుల దృశ్యాలే. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళనలో జనం ఉన్నారు.
మరణ మృదంగం
సిపిఎం 2018లో 15 మండలాల్లోని 143 గ్రామాలను పరిశీలించగా 1271 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమాచారం లభించింది. ఆనాటికే సుమారు 3 వేల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా వేశారు. 2017-18 సంవత్సరం లోనే 107 మంది కిడ్నీ వ్యాధితో మరణించారు. నాలుగేళ్ళు గడిచాయి. ప్రభుత్వాలు మారాయి. పార్టీలు, పాలకులు మారారు. కానీ కిడ్నీ వ్యాధి తీవ్రతలోను, నివారణ చర్యల్లోను మార్పు లేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారింది.
గత వారం రోజుల్లో ఏ.కొండూరు మండలంలో నలుగురు మతి చెందారన్న సమాచారం అందడంతో సిపిఎం బృందం ఆ కుటుంబాలను పరామర్శిస్తోంది. బాణావతు సక్రి అనే 45 సంవత్సరాల మహిళ చైతన్య నగర్ తండాలో మృతి చెందిందనే వార్త తెలియగానే అక్కడకు హుటాహుటిన చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించాం. సహాయం కోసం ఆందోళన సాగించాం. ఇటువంటి మరణ వార్తలు ఎన్నో. ధీప్లా నగర్ తండాలో ఉన్న 150 కుటుంబాలలోని 90 కుటుంబాలలో ఎవరో ఒకరు, భార్యభర్త ఇద్దరూ లేదా పిల్లలతో సహా కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు పేర్లతో సహాచెప్పారు. 4 సంవత్సరాల క్రితం ఆ తండాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను 48 మందిని గుర్తించి జాబితా తయారు చేశారు. ఇప్పుడు ఆ జాబితాను చూస్తే 16 మంది ఈ కాలంలో మరణించారన్న కఠోర వాస్తవం అర్థమయ్యింది. ఈ తండాకు చెందిన వెంకటేష్ నాయక్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇతరులతో పాటు అండగా నిలిచారు. ఉద్యమంలో పాల్గొన్నారు. సమాచారం సేకరించారు. కానీ ఇప్పుడు అతని తల్లి మరణించింది. వారి కుటుంబంలో, సమీప బంధువులలో ఐదుగురు మరణించారు. ఇటువంటి కుటుంబాలు ఎన్నో. ఈ కిడ్నీ వ్యాధి అన్ని తరగతుల లోనూ విస్తరించింది. ప్రత్యేకించి గిరిజనులు, దళితులు, పేదల్లో మరింత తీవ్రంగా ఉంది.
నడవలేక, మంచాన పడితే తప్ప కిడ్నీ వ్యాధి ఉందని గమనించలేక పోతున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడి సరిపెట్టుకుంటున్నారు. పరిస్థితి తీవ్రమైతే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోతోంది. కొద్దిరోజులకు డయాలసిస్ చేయించుకోక తప్పడం లేదు. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకునే రోగులున్నారు. ఆస్పత్రి నుండి రావడం, మళ్ళీ వెళ్ళటం నిత్యకృత్యంగా మారిపోయింది. డయాలసిస్ చేయించుకుంటే ప్రాణం పోతుందనే అపోహ, భయంతో ఎంతోమంది డయాలసిస్ చేయించుకోవడం లేదు. మొత్తం రోగులలో డయాలసిస్ చేయించుకునే వారి సంఖ్య 5 శాతం మాత్రమే. సీరం క్రియాటినిన్ 1.5 దాటి, కిడ్నీ వ్యాధి 3,4,5 దశలు చేరిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వారు నెలనెలా ఐదు నుండి రూ.10 వేల వరకు మందులు, ఆసుపత్రులకు ఖర్చు పెదుతున్నారు. వీరికి ప్రభుత్వం మందులు ఇవ్వడం లేదు. ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదు. ఒక రోగి రూ. 23 లక్షల ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది.
దీన గాథలు
డబ్బుల్లేక 31 శాతం మంది రోగులు మందులు కూడా వాడటం లేదు. ఆసుపత్రికి వెళ్లటం లేదు. ప్రభుత్వం డయాలసిస్ చేయించుకునే వారికి మాత్రం రూ.10 వేల పెన్షన్ ఇచ్చి సరిపెడుతోంది. వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ జరుగుతున్నా మందులు, సూదులు, రక్తం కొనుగోలుకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తున్నది. వీరిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళటానికి అంబులెన్సులు, తగు రవాణా సౌకర్యం లేక వేల రూపాయలు ప్రయాణ ఖర్చులు అవుతున్నాయి. చనిపోయిన సక్రి కుటుంబం ప్రయాణ ఖర్చులకు నాలుగేళ్లలో లక్ష రూపాయలు పెట్టాల్సి వచ్చిందంటేనే తీవ్రత అర్థమవుతుంది. డయాలసిస్ చేయించుకునేందుకు ఒక గిరిజన పేద రైతు తన వ్యవసాయ భూమిని అమ్మి కారు కొనుగోలు చేశాడు. తన కుమారుడి చదువు మాన్పించి, డ్రైవింగ్ నేర్పించి ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడని చెప్పిన మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు తిరగక తప్పదు. ఎంతోమంది వైద్యం కోసం, ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్తులు, ఉన్న కొద్దిపాటి భూములు అమ్ముకుం టున్నారు.అప్పులపాలవుతున్నారు. మందుల వాడకపోతే ప్రాణం పోతుందని తెలిసినా డబ్బులేక నిశ్చేష్టులుగా ఉండిపోతున్నారు.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా దీనికి కారణాలను ప్రభుత్వం నిర్ధారించడం లేదు. మంచి నీటిలో ఫ్లోరైడ్, సిలికా తదితర ప్రమాదకరమైన పదార్థాలు ఉండటంతో కిడ్నీ వ్యాధి వస్తున్నదని నిపుణులు, ప్రజలు భావిస్తున్నారు. కొన్ని బోర్లు వాడకూడదని రెడ్ మార్కులు వేశారు. 4 సంవత్సరాల క్రితం మూసివేసిన కొన్ని బోర్లలో నీటినే మళ్లీ యథావిధిగా వాడటం నేడు చూసాం. రూ.800 కోట్లతో కృష్ణా జలాలు తీసుకొస్తామని గత, నేటి పాలకులు మాటలు చెప్పారు. ఈ ప్రాంత వాసుల కృష్ణా జలాల కల కలగానే మిగిలిపోయింది. ఆర్‌ఓ ప్లాంట్లు కొన్ని చోట్ల పెట్టినా డబ్బా మంచి నీరు 5 నుండి 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కనీసం ఉచితంగా రక్షిత మంచినీరు కూడా ప్రభుత్వం అందించలేకపోవడం సిగ్గుచేటు.
2018 సంవత్సరంలో సిపిఎం, ప్రజా సంఘాలు, స్థానికులు ఆందోళన చేయడంతో ఆనాటి ప్రభుత్వం స్పందించక తప్పలేదు. ఉద్యమ ఒత్తిడితో తిరువూరు, నూజివీడులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న ఏ.కొండూరు, తదితర మండలాల్లో ఇప్పటికీ డయాలసిస్ కేంద్రాలు పెట్టలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి కనీస ఆర్థిక సహాయం అందించడం లేదు. ఉచిత స్క్రీనింగ్ , వైద్య పరీక్షలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సరఫరా తదితర అంశాలతో గతంలో కొంత ఉపశమనం జరిగినా నేడు అవి నిలిచిపోయాయి.
కొరవడిన పాలకుల దృష్టి
వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడచినా కనీసం సమస్య తీవ్రతను గుర్తించలేదు. స్పందన లేదు. ప్రజాప్రతినిధుల దృష్టి కొరవడింది. కొద్ది రోజుల క్రితం సిపిఎం బృందం పర్యటించడం, మళ్లీ వాస్తవాలు వెలుగులోకి రావటం, పత్రికల్లో వచ్చిన వార్తలతో ఆరోగ్య మంత్రి ఇప్పటికైనా స్పందించారు. సంతోషం. కానీ మూడు సంవత్సరాలు ప్రభుత్వం, ఆరోగ్య వ్యవస్థ ఎందుకు గమనించలేదనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ప్రజా ప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు తొంగి చూసిన పాపాన పోలేదు.
కృష్ణా జిల్లాలో ఉన్నా కృష్ణా జలాలు తాగటానికి లేకపోవడం శోచనీయం. రామచంద్రాపురం గ్రామం వరకు పైప్‌లైన్ వేసినా, మంచి నీరు మాత్రం సరఫరా చేయటం లేదు. ఫ్లోరైడ్ నీటితో పాటు పెయిన్ కిల్లర్లు అధికంగా వాడటం వ్యాధి తీవ్రతను పెంచుతున్నదని కొందరు వైద్యనిపుణులు అంటున్నారు. ప్రభుత్వ సహాయం అందక, ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో జబ్బును సకాలంలో గుర్తించి మందులు వాడలేకపోతున్నారు. దాంతో వ్యాధి తీవ్రత మరింత పెరిగిపోతోంది. మూఢనమ్మకాలను పోగొట్టి, వైద్యపరంగా ప్రజలను చైతన్యపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌భవ, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, గిరిజన అభివృద్ధి పథకాలు ఇలా ఎన్నో వున్నా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి. సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటూ, ప్రజలకు కనీసం వైద్య సౌకర్యం కూడా కల్పించకపోవడం పాలకులకే అవమానం. పంచాయతీల్లో ప్రత్యేకించి, గిరిజన తండాల్లో ప్రజారోగ్యం, పారిశుధ్యం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. పంచాయతీ ఆదాయం లేక గ్రాంట్లను ప్రభుత్వం కరెంటు బిల్లులకు జమ వేసుకుని, అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పంచాయతీలు చేతులెత్తేశాయి. పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు లేవు. సున్నం, చీపళ్లు కొనుగోలుకు నిధులు లేవు. ప్రభుత్వం పంచాయతీలను ఈ దుస్థితికి నెట్టివేసింది. ఇంకా ఆరోగ్య పరిరక్షణ పట్టించుకునే దిక్కెవరు?
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నిపుణుల బందాలను ఏర్పాటు చేసి, వ్యాధి కారణాలను నిర్ధారించి తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ఏ.కొండూరు తదితర మండలాల్లో డయాలసిస్ కేంద్రాలు పెట్టాలి. కృష్ణా జలాలతో రక్షిత మంచినీటిని అందించాలి. అప్పటి వరకు కనీసం ఆర్.ఓ ప్లాంట్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలి. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్, పరీక్షలు చేసి జబ్బు తీవ్రతను గుర్తించి మందులు ఉచితంగా ఇవ్వాలి. కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కనీసం ఐదు వేల రూపాయలు సహాయం చేయాలి. చనిపోయిన కుటుంబాలకు గతంలో హామీ ఇచ్చిన విధంగా భూమి, ఆర్థిక సహాయం అందించాలి. అంత్యక్రియల ఖర్చులు కూడా ఇవ్వాలి. 'మా తల్లిదండ్రులు కిడ్నీ వ్యాధితో మరణించారు. మేం కిడ్నీ వ్యాధితో తల్లడిల్లిపోతున్నాము. కనీసం మా పిల్లలను, భవిష్యత్తు తరాలనైనా కాపాడండి' అని స్థానికులు చెబుతున్న మాటలు, విజ్ఞప్తులతోనైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. మొద్దు నిద్ర వీడాలి.
/ వ్యాసకర్త : సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు /
సిహెచ్. బాబూరావు











