ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలంలోని చిగురుకోటలోని మీనా ఎంటర్‌ప్రైజెస్ ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదానికి గురై మృతి చెందిన సారిపల్లి కృష్ణ (32) కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ డిమాండ్ చేశారు. మృతుడు కృష్ణ మృతదేహాన్ని శుక్రవారం గుడివాడ ప్రభుత్వాసుపత్రి వద్ద సిఐటియు కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్‌సిపి.రెడ్డి, ఏలూరు జిల్లా నాయకులు జె.గోపితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మృతునికి భార్య, ఎనిమిది నెలల కుమారుడు ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో డ్యూటీలో ఉండగా సారేపల్లి కృష్ణ విద్యుదాఘాతానికి గురవ్వగా యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా రాత్రి తొమ్మిది గంటల వరకు స్థానిక ఆర్‌ఎంపి వైద్యుల చుట్టూ తిప్పడంతో సరైన వైద్యం అందక కృష్ణ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీనా ఎంటర్‌ప్రైజెస్ ఫ్యాక్టరీలో ఫస్ట్‌ఎయిడ్ సౌకర్యంగాని, అంబులెన్స్‌గాని లేవని, కనీస సౌకర్యాలు కూడా కల్పించ లేదని విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా మెరుగైన వైద్యం అందించకపోవడంతో కార్మికుడు కృష్ణ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్, కార్మిక శాఖాధికారులు తక్షణమే స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇచ్చిన విధంగా రూ.50 లక్షలు నష్టపరిహారం మృతుని కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.










