ప్రజాశక్తి- దత్తిరాజేరు : మండలంలోని చిన్న చామలపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ వద్ద కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణాన్ని ఆ గ్రామానికి చెందిన యాదవులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై గ్రామస్తులతో మాట్లాడు తామని ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆర్‌డిఒ మంగళవారం స్థానిక విఆర్‌ఒ ద్వారా కబురు పంపారు. ఆ కొండను సాగు చేసుకుంటున్న పేద రైతులతో పాటు, ఆ కొండపై బతుకుతున్న యాదవులు కూడా ఆర్‌డిఒ వస్తారని, తమ సమస్య చెప్పుకుందామని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎదురు చూశారు. ఆర్‌డిఒ రాకపోవడంతో తమ ప్రాణాలు పోయిన ఆ భూమిని కృషి విజ్ఞాన కేంద్రానికి ఇవ్వబోమని నిరసన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాకోటి రాములు మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన యాదవులకు చెందిన జీవాలకు ఈ కొండ ప్రధాన జీవనాధారమన్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూడకుండా ఇక్కడే ఈ కేంద్రం నిర్మిస్తామని అనడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి కృషి విజ్ఞాన కేంద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి మన్యాల ఎరుకునాయుడు, సర్పంచ్ శ్రీను, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.