Oct 29,2023 21:39

ఐఆర్‌ఎస్‌లో ఎంపికైన సాగర్‌బాబు
ప్రజాశక్తి - ఉంగుటూరు
   విద్యార్థి స్థాయి నుంచే ఎంచుకున్న రంగంలో పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయని సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ టాక్సెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ యాళ్ల సాగర్‌ బాబు తెలిపారు. ఆదివారం మండలంలోని పెద వెల్లవెల్లి గ్రామంలోని షాలేము పెంతుకోస్తు ప్రార్థన మందిరంలో పాస్టర్‌ ఇస్రాయెల్‌ అధ్యక్షతన సాగర్‌ బాబును ఘనంగా సంఘ సభ్యులు సత్కరించారు. జంగారెడ్డి గూడెం మండలం జొన్న వారి గూడెంకు చెందిన సాగర్‌ బాబు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా సాగర్‌బాబును సన్మానించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ సాగర్‌ బాబు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలన్నారు. ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకొని ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని యువతకు సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను వొమ్ము చేయకుండా విజయం సాధిస్తే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కష్టాలను అధిగమించి చిన్నస్థాయి నుంచే ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల సొంతంగా ప్రిపేర్‌ అయ్యి ఐఆర్‌ఎస్‌ సాధించారని తెలిపారు. అపజయాలను చూసి భయపడకుండా ముందుకు వెళితే విజయం సాధించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, యువత పాల్గొన్నారు.