ప్రజాశక్తి - పల్నాడు జిల్లా విలేకర్లు : పని వత్తిడి, అధికారుల వేధింపుల వల్ల గుంటూరు జిల్లా, తాడేపల్లిలో ఆశ కార్యకర్త రేపూడి కృపమ్మ మృతి చెందారని ఆశా కార్యాకర్తలు ఆవేదన, ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం పలుచోట్ల విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నిరసన తెలపగా సిఐటియు మండల కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ మాట్లాడారు. వివిధ రకాల పేర్లతో ఆశా కార్యకర్తలకు టార్గెట్లు పెట్టి పనిభారం పెంచడమే కాకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. పనిభారం తగ్గించాలని, వారిని కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో యశోద, యామిని, రోజా, ధనలక్ష్మి, మెహర్నిస్సా, రిహన పాల్గొన్నారు. చిలకలూరిపేటలోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం సంతాప సభ నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం కోసం పోరాడుతుంటే అరెస్టులు, నిర్బంధం దారుణమని మండిపడ్డారు. కె.మరియమ్మ, వి.వెంకటలక్ష్మి, పి.శ్రీదేవి, వి.రాజేశ్వరి, ఎస్.చిన్న, ఎం.విల్సన్ పాల్గొన్నారు. అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆశాలు ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడారు. రకరకాల యాప్‌లు, రికార్డులను పెంచి జాబ్‌ఛార్టుకు సంబంధం లేని పనులను ఆశాలతో చేయిస్తు న్నారని విమర్శించారు. జగనన్న సురక్ష సర్వేలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. నాయకులు కె.సుబ్బా రావు, పద్మ, రాజకుమారి, అనిత, శీరీష, షేక్ ఖాశింబీ, మహా లక్ష్మి, సుహాసిని విజయకుమారి, మరియమ్మ పాల్గొన్నారు.










