Oct 09,2023 00:16

కృపమ్మ కుటుంబంతో మాట్లాడుతున్న పంచుమర్తి అనురాధ

ప్రజాశక్తి-తాడేపల్లి : పని ఒత్తిడితో మృతిచెందిన తాడేపల్లి పట్టణంలోని ముగ్గురోడ్డుకు చెందిన ఆశ కార్యకర్త రేపూడి కృపమ్మ కుటుంబానికి ఆదివారం టిడిపి తరుపున ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. సిఐటియు, టిడిపి రెండు రోజుల పాటు పెద్దఎత్తున పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగొచ్చి రూ.10 లక్షలు ఆర్థిక సాయంతో పాటు ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకులు నారా లోకేష్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి రూ.2 లక్షలు తమ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ వృత్తికి సంబంధంలేని పనులు చేయించడం వల్లే ఒత్తిడి గురై కృపమ్మ మృతి చెందారని, కృపమ్మ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సరైన శిక్షణ లేకుండా ఆశ వర్కర్లకు పనులు అప్పగించి ఒత్తిడికి గురి చేస్తున్నారని, జగన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రజల డబ్బుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. షుగర్‌, బిపి మందులు తప్ప వైద్య శిబిరాల్లో ఏమీ ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర జీతాలు ఇస్తూ వారికి త్రిశంకు స్వర్గంలోకి నెట్టేశారన్నారు. ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ పథకాలు అందడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, ఆరుద్ర భూలక్ష్మి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు పాల్గొన్నారు.