Aug 04,2021 15:58

బెంగళూరు : ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన బసవరాజు బమ్మయి తన కేబినెట్‌ విస్తరణ చేపట్టారు. 29 మంది కొత్త మంత్రులకు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో కర్ణాటక కేబినెట్‌ బలం 34కి చేరింది. అయితే ఉపముఖ్యమంత్రులు ఎవరూ ఉండరని చెప్పారు. కేంద్ర అధిష్టానం నిర్ణయం మేరకే ఉప ముఖ్యమంత్రులను తొలగించామని పేర్కొనడం గమనార్హం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించిన సంగతి తెలిసిందే. వారిలో ఆయన కుమారుడు బివై. విజయేంద్ర కూడా ఉన్నారు. నూతన మంత్రులు బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ నివాసంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సిఎం తెలిపారు. అయితే యడియూరప్ప కుమారుడు, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు విజయేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గనరని అన్నారు. కేబినెట్‌ విస్తరణపై కేంద్రంతో గతంలోచర్చలు జరిపానని , మంగళవారం రాత్రి కూడా మరోసారి చర్చించానని, బుధవారం ఉదయం నాటికి జాబితా సిద్ధమైందని అన్నారు. ఈ జాబితాను రాష్ట్ర గవర్నర్‌కు కూడా పంపానని చెప్పారు. నూతన కేబినెట్‌ అనుభవజ్ఞులు, కొత్తవారితో బలోపేతం అయిందని, వీరిలో ఏడుగురు ఒబిసిలకు చెందినవారు, ముగ్గురు ఎస్‌సిలు, ఒకరు ఎస్‌టికి చెందినవారు ఉన్నారని అన్నారు. అలాగే ఏడుగురు వొక్కళిగస్‌, ఎనిమిది మంది లింగాయత్‌లు, ఒకరు రెడ్డిలకు చెందినవారని.. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారని వివరించారు.