Jul 28,2021 09:01

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారన్న వార్తలకు న్యాయం చేస్తూ...యడ్డియూరప్ప తన పదవిని వదులుకొన్నారు. కొత్త సిఎంగా ఊహించినట్లుగానే...హోం శాఖ మంత్రి, యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు బసవరాజ్‌ బమ్మైను బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ శాసనాసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, బసవరాజ్‌ తండ్రి కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఒకసారి ఈ నూతన సిఎం పూర్వపరాలు గమనిస్తే..
     1960లో హుబ్లీలో బసవరాజు జన్మించారు. ఆయన ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. టాటాలో ఉద్యోగం చేశారు. 32 సంవత్సరాల క్రితం బసవరాజు తండ్రి కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించారు. బసవరాజు రాజకీయ జీవితం జనతాదళ్‌(యు) పార్టీతో మొదలైంది. 2008లో 22 మందితో కలిసి బిజెపిలో చేరారు. 1998, 2004 ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్‌ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో జలవనరుల శాఖా మంత్రిగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఆయనకు భార్య చెన్నమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కర్ణాటక కొత్త సిఎం బసవరాజు గురించి ఈ విషయాలు తెలుసా..?
        బసవరాజు కూడా కూడా లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వారే. అలాగే ఈయన పేరులోని 'బసవ' అనే పదం ఈ వర్గాన్ని 12వ శతాబ్దంలో స్థాపించిన బసవేశ్వరుడిని సూచిస్తుందట.లింగాయత్‌ సామాజిక వర్గానికి లేదా మరో వర్గానికి ఈ పదవిని కట్టబెట్టాలా అని అధిష్టానం యోచించగా..చివరికీ యడియూరప్ప సన్నిహితుడు...లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజునే ఎంపిక చేసింది. బసవరాజ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులుగా బిజెపి అధిష్ఠానం నియమించిన కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్‌తో పాటు కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జి అరుణ్‌ సింగ్‌, ఆపదర్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప కూడా హాజరయ్యారు. బమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.