
ప్రజాశక్తి-పెద్దారవీడు
వర్షాలు లేక... సాగునీటి వనరులు లేక సాగు చేసిన పంటలన్నీ ఎండినా... రైతన్నలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా... ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎపి రైతు సంఘం జిల్లా నాయకుడు డి.సోమయ్య ఆరోపించారు. పెద్దారవీడు మండలంలో ఈ ఏడాది దారుణమైన కరవు తాండివిస్తోందన్నారు. కనీసం తాగునీటికి సైతం కటకటలాడుతున్నారన్నారు. పెద్దారవీడు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం పెద్దారవీడు తహశీల్దారు కార్యాలయం ఎదుట రైతులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో ప్రకాశం జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడంతో తీవ్ర అభ్యంతరకరమన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, వివక్షత ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. కళ్ల ఎదుటే పంటలన్నీ ఎండిపోయినా... ప్రభుత్వం కరవును గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో 70 శాతం భూములలో పంటలు ఎండిపోయాయని, రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు మొత్తం కూడాను వెనక్కి తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. తాగునీటికి సైతం కటకలాడుతున్నారని, పశువులు నీరు లేక వలసలు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం దష్టిలో తీవ్రమైన వెనుకబడిన, వర్షం మీదనే ఆధారపడిన పశ్చిమ ప్రకాశంలో కరువు కనిపించకపోవడం మన ప్రాంత రాజకీయ నాయకుల చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు మండలంగా ప్రకటించాలని, కరవు సహాయక చర్యలు చేపట్టాలని, ఎండిన అన్ని రకాల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, పూర్తి అయిన వెలుగొండ ప్రాజెక్టు మొదటి సారంగం ద్వారా నీటిని వెంటనే కనీసం 10 టిఎంసిలకు తగ్గకుండా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పనులు వెంటనే ప్రారంభించి, రోజు కూలీ రూ.600లు వచ్చేలా పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దారు ఎంవి క్రిష్ణారెడ్డికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి అల్లు పెద్ద అంకిరెడ్డి, రైతులు గుండారెడ్డి నాగిరెడ్డి, అల్లు సుబ్బరాయుడు, గొట్టం శ్రీరాములు, బుక్క ఆవులయ్య, గుండారెడ్డి గోవిందరెడ్డి, మూడమంచు సుబ్బయ్య, అల్లు వెంకటసుబ్బారెడ్డి, అల్లు కోటిరెడ్డి, ఆళ్ల రాములు, చిన్న గాలెయ్య, నాలి నాగయ్య, గొట్టం బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.