ప్రజాశక్తి - ఆదోని
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు చేతకందక రైతులు తీవ్ర కరువులో కూరుకుపోయారని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.రాధాకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆదోనిలోని సుందరయ్య భవన్‌లో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో 350 మండలాలకు గాను 103 మండలాల్లో తీవ్ర కరువు ఏర్పడిందని తెలిపారు. సాగు చేసిన పంటలు చేతికందక పెట్టిన పెట్టుబడి తిరిగి రాక రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు. ఉన్న ఊళ్లో పనులు దొరకక పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలస పోతున్నా కరువు లేదని ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. కరువు తాండవిస్తున్నా సహాయక చర్యలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడం దారుణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కేంద్రానికి ఎలాంటి నివేదిక, కనీసం లేఖ కూడా రాయని దుస్థితిలో ఉందని విమర్శించారు. కడప జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. కరువును ఏ కొలబద్ధన నిర్ధారించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. జిల్లాలోని తుగ్గలి మండలంలో తీవ్రమైన కరువు పరిస్థితి ఉన్నా కరువు ప్రాంతంగా ప్రకటించకుండా విస్మరించారని మండిపడ్డారు. పంటలు సాగు చేసినప్పటికీ నెలలు తరబడి వర్షం కురవలేదని, ఏ ప్రాతిపదికన కరువు లేదని తేల్చారో తెలపాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 30 నాటికి ఖరీఫ్ సీజన్ ముగిసిందన్నారు. రబీ ప్రారంభమైనా ఎక్కడా పంటలు సాగు చేస్తున్న పరిస్థితి లేదన్నారు. ఉపాధి హామీ చట్టం కింద గ్రామాల్లో పనులు కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు. గ్రామాల్లో కరువు దృష్ట్యా సహాయక చర్యలు చేపట్టడంలో ఇప్పటికీ సరైన ప్రణాళిక లేదన్నారు. ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. రైతు కుటుంబాలకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికీ రూ.10,000 కరువు సాయం ప్రకటించాలని కోరారు. మనిషికి 10 కిలోలు కాకుండా 20 కిలోలు బియ్యం బతకడానికి ఇవ్వాలని తెలిపారు. కరువు పరిస్థితులపై ఇప్పటికే ప్రభుత్వానికి సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చామని వివరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.గోపాల్, తిప్పన్న, నాగరాజు, ముక్కన్న, వెంకటేష్, నాగేంద్ర, మునెప్ప ఉన్నారు.