Nov 06,2023 21:29

జగన్మోహన్‌రెడ్డి

      అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం నాడు శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనపై అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. తీవ్రమైన కరువులో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి ఏమైనా కరుణ చూపుతారా అని ఎదురు చూస్తున్నారు. కరువు మండలాల ప్రకటన ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇందులో కొన్ని మండలాలను మినహాయించారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్న డిమాండ్‌ అందరి నుంచి వస్తోంది. సత్యసాయి జిల్లాలో 31 మండలాలుంటే ఏడు తీవ్రమైన కరువు మండలాలుగానూ, 15 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటింంచారు. తక్కిన 11 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించలేదు. వీటిని కూడా ప్రకటించాలనని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 31 మండలాలుంటే 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. మూడు మండలాలను మినహాయించారు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచి వాతావరణ పరిస్థితులూ అంతటా ఒకే రకంగా ఉన్నాయి. వర్షాలు అప్పుడప్పుడు పడినా ఆదునుదాటక రావడంతో రైతులు పంటల సాగు కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. రెండు జిల్లాల పరిధిలో కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఎకరాల వరకు భూమి బీడుగానే ఉంది. వర్షపాతం రిత్యా చూసుకున్నా సత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 487.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 306.3 మిల్లీమీటర్లు నమోదయింది. సాధారణం కంటే 37.2 శాతం వర్షపాత లోటుంది. అదే సమయంలో అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 428.6 మిల్లీమీటర్లకుగానూ 267,5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. ఇక్కడ కూడా సత్యసాయి జిల్లాతో సమానంగా 37.6 మిల్లీమీర్లు వర్షపాతం లోటుంది. వర్షపాతం అక్టోబరు మాసంలో మరింత తక్కువగా పడింది. దీంతో వేసిన పంటను తొలగించడంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రబీ సాగు కూడా నా మాత్రంగానే ఈ ఏడాది ఉంటోంది.
ఉపాధి లేక వలసలు
తీవ్ర వర్షాభావం నేపథ్యంలో పంటలు ఏ మాత్రం చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉపాధి లేక గ్రామాల నుంచి అప్పుడే వలసలు మొదలయ్యాయి. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, కదిరి, పెనుకొండ మండలాల నుంచి వలసలు అధికంగా ఉంటున్నాయి. వలసల నివారణకు చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులు ఇంకా మొదలవలేదు. ఈ ఏడాది ఉపాధి హామీ పనులు కూడా తక్కువగానే జరిగాయి. సత్యసాయి జిల్లా పరిధిలో 2.73 లక్షల జాబ్‌కార్డులుంటే 1.3 లక్షల మందికి పని కల్పించారు. అది కూడా సీజన్‌ ప్రారంభానికి మందే ఏప్రిల్‌, మే మాసాల్లోనే కల్పించారు. ఇప్పుడు పనుల్లేకపోవడంతో కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలసలు వెలుతున్నారు. పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
తప్పని సాగునీటి కష్టాలు
సాగునీటి కష్టాలు ఈ ఏడాది అధికంగా ఉండనున్నాయి. ఇప్పటికే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, హంద్రీనీవా రెండు కాలువలకు నీటిని నిలిపేస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లాలో ఈ రెండు కాలువల కింద సాగైన వరి, మిరప, పత్తి పంటలకు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంట దిగుబడులు రావడానికి కీలకమైన సమయంలో నీరు రాకపోతే రైతులు పెద్దఎత్తున నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నీటిని అందించేందుకు ప్రభుత్వ స్థాయిలోనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రైతులు కోరుతున్నారు.
కరువు సహాయం ప్రకటించేరా .?
తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఏమైనా సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటిస్తారా అని అనంతపురం, సత్యసాయి జిల్లావాసులు ఎదురు చూస్తున్నారు. రాబోయే తాగు,సాగునీటి కష్టాలను ఎదుర్కొనేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది ప్రకటిస్తారా అని కూడా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సాగనుంది ఇలా.?
ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. గన్నవరం విమానిశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. 10.25 గంటలకు వరకు ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 10.45 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.15 గంటలకు సభలోని పాల్గొని రైతుభరోసాను విడుదల చేస్తారు. ప్రసంగం, మెగా చెక్‌ పంపిణీ అనంతరం 12.20 గంటలకు తిరుగు ప్రయణమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విమనాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరిగి విజయవాడకు పయనమవుతారు.