అనంతపురం ప్రతినిధి : తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తారని ఉమ్మడి అనంతపరం జిల్లా వాసులు ఆశించారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా అటువంటి స్పందనేది కనిపించలేదు. నాలుగేళ్లు కరువు లేదు.. ఈసారి కొన్ని మండలాల్లోనే ఉందంటూ దాటవేశారు. పుట్టపర్తి జిల్లాలో 11 మండలాలు కరువు మండలాల జాబితాలో లేవని,డ వీటిని కరువు మండలాలుగా ప్రకటించాలని ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ దీనిపై ఎటువంటి ప్రకటనా ముఖ్యమంత్రి నుంచి రాలేదు. రైతు భరోసా రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పుట్టపర్తికి మంగళవారం విచ్చేశారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ అనంతపురం, సత్యసాయి జిల్లా నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి రైతు భరోసా పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తమ హయాంలో రైతుల కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు. నాలుగున్నరేళ్ల కాలంలో రూ.1.75 లక్షల కోట్లు రైతులకు ఖర్చు పెట్టామని వివరించారు. అదే తెలుగుదేశం హయాంలో రైతులను పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ఆధ్యంతం ఆయన ప్రసంగం మొత్తం రెండు ప్రభుత్వాల పాలనను బేరీజు వేస్తూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలో కరువు పరిస్థితుల గురించిగానీ, ఇక్కడి అభివృద్ధి అంశాలను గురించి ప్రస్తావించలేదు. సాగు,తాగునీటి కష్టాలు కూడా త్వరలో రాబోతున్న తరుణంలో ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఏమైనా హామీలిస్తారని రెండు జిల్లాల వాసులు ఎదురు చూశారు. కాని అటువంటి ప్రకటనేది చేయలేదు. పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో 31 రహదారుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తామన్న హామీ ఒక్కటే ఆయన ఇచ్చారు. ఎన్నికల సమయంలో జిల్లాకు ఏమైనా వరాలిస్తారని భావించినప్పటికీ అటువంటి అంశాలేవి ప్రసంగంలో ప్రస్తావనకు రాలేదు. ఇది అనంతపురం, సత్యసాయి జిల్లావాసులు నిరాశ పరిచింది. అదే విధంగా సత్యసాయి జిల్లాను తిరిగి అనంతపురంలో వీలినం చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ అంశంపైనా ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు.
ప్రొటోకాల్‌పై వివాదం
ముఖ్యమంత్రి సభా వేదికపై ప్రొటోకాల్ అంశాలపై చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వేదికపైకి ఎక్కేసరికి ఆయనకు కేటాయించిన సీటు ఏదీ లేకపోవడంతో అక్కడున్న జిల్లా వ్యవసాయాధికారిని ప్రొటోకాల్ పాటించరా.? అని అడగడంతో ఆయన పరుగునవెళ్లి కూర్చీ తీసుకొచ్చి ఆయనే వేశారు. అనంతపురం ఎంపీ విషయంలోనూ అదే రకంగా జరిగింది.
ముఖ్యమంత్రికి జర్నలిస్టుల సన్మానం
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి జర్నలిస్టులు జ్ఞాపికను అందజేయడంతోపాటు శాలువా కప్పి సన్మానించారు. జర్నలిస్టులకు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలివ్వాలని క్యాబినెట్‌లో ఇటీవల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తికి మంగళవారం నాడు ఆయన విచ్చేసిన సందర్భంగా జర్నలిస్టులు కలసి ఆయన్ను సన్మానించారు. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రామచంద్రారెడ్డి, శివారెడ్డి, పి.శ్రీనివాసులు, నరేష్, అనిల్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు, నాయకుల కోసం సుదీర్ఘ సమయం కేటాయింపు
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈ పర్యటనలో జిల్లా నేతలకు సుదీర్ఘ సమయమే కేటాయించారు. సాధారణంగా జగన్మోహన్‌రెడ్డి ముఖ్య నేతలతో కలసి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది. త్వరలో ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఈసారి సమయం ముగిసినా ముఖ్య నాయకులతోపాటు, ద్వితీయ శ్రేణి నాయకుల వరకు అందరికీ సమయమిచ్చి మాట్లాడారు. దీంతో ఆయన తిరుగు ప్రయాణం నిర్ణీత సమయం కంటే ఆలస్యంగానే సాగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి పుట్టపర్తి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శంకర్‌నారాయణ, సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తిప్పేస్వామి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాది రైతు ప్రభుత్వం
వైఎస్.జగన్మోహన్‌రెడ్డి
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు భరోసా సాయం పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన బహిరంగ సభలో రైతులు, ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అండగా నిలుస్తోందని చెప్పారు. రైతన్నకు మంచి జరగాలి.. పేద వాడికి మేలు జరగాలి.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించేందుకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాలా సాయం అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. చంద్రబాబు నాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు ఎలాంటి సాయం అందించలేదన్నారు. టిడిపి స్కీమ్‌ల ప్రభుత్వం కాదని.. స్కాంల ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు పేరు చెబతే స్కామ్‌లే గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలన్నది ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు.