Nov 01,2023 01:23

అభివాదం చేస్తున్న టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టిడిపి,జనసేన నాయకులు విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. టిడిపి పరిశీలకుడుగా హాజరైన శాసనమండలి మాజీ చైర్మన్‌ యం.డి షరీఫ్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో సంయుక్త పోరాటాలు చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కరువు తీవ్రంగా ఉన్నా ఒక్క ప్రాంతంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. నిత్యం రాజకీయపరమైన విమర్శలు తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, రైతులకు ఓదార్పు ఇవ్వడంలో మంత్రులు దృష్టి సారించడంలేదన్నారు. రాష్ట్రంలో 60 శాతం ప్రజలు టిడిపి జనసేన పార్టీకి ఉన్నారన్నారు.. ప్రతిపక్ష ఓట్లు చీలకుండా నిర్ణయం తీసుకున్న జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ టిడిపి జనసేన పొత్తుతో వైసిపికి ముచ్చెటమటలు పడుతున్నాయన్నారు. జనసేన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులు ముత్తా శశిధర్‌ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అక్రమం, అన్యాయమని అన్నారు. చంద్రబాబు అరెస్టు జరిగిన రోజునుండి పవన్‌ కల్యాణ్‌ను కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. వైసిపి ప్రభుత్వంపై ఇరుపార్టీలు నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు మాట్లాడుతూ టిడిపి జనసేన సమైక్య పోరాటాలు నిర్వహిచాలన్నారు. పల్నాడు జిల్లాలో మంచినీటి సామాన్య తీవ్రంగా ఉందన్నారు. రైతులు నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలవకూడదని జగన్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఓటర్ల నమోదులో అక్రమాలను ఇరు పార్టీల వారు పరిశీలించి అడ్డుకోవాలన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్‌కు దక్కిందన్నారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ తీసుకురావటానికి పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశంతో కలిశారన్నారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ఓటమి ఖాయం అన్నారు. జనసేన తెలుగుదేశం కలిసి సమస్యలపై పోరాడాలన్నారు. గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఓటర్ల లిస్టులో అక్రమాలకు పాల్పడు తున్నారని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపి శ్రీరాం మల్యాద్రి, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు యరపతినేని శ్రీనివాసరావు, బి.రామాంజనేయులు, నరేంద్రకుమార్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, నసీర్‌ అహ్మద్‌, కోవెలమూడి రవీంద్ర, వేగేసిన నరేంద్రవర్మ, జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.