Nov 03,2023 01:08

కాకుమాను మండలం రేటూరులో నెర్రెలిచ్చిన వరిపొలం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కరువు మండలాల ప్రకటనలో జిల్లాలోఒక్క మండలాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదు. కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు మండలాలను గుర్తించినా గుంటూరు జిల్లాల్లో కరువు పరిస్థితులను పట్టించుకోలేదు. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు కొంత వరకు మెరుగ్గా ఉన్నా అవసరమైనప్పుడు కురవకపోవడం, ఎక్కువ కాలం వేడిగాలులు ఉండటం, ఖరీఫ్‌ ముగిసే సమయంలో వర్షాలు కురవడం వల్ల మొత్తం సాగు విస్తీర్ణంలో కేవలం 69 శాతం భూముల్లోనే పంటలు వేశారు. మొత్తం 3.38 లక్షల ఎకరాలకు గాను 2.38 లక్షల ఎకరాల్లోనే సాగు అయింది. దాదాపు లక్ష ఎకరాల్లో ఏ పంటా వేయకుండా ఖాళీగా భూములు ఉన్నాయి.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం 75 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సేద్యం జరిగితే కరువుగా గుర్తించవచ్చు. అలాగే వర్షపాతం 50 శాతం కంటే తక్కువుగా ఉన్నా కరువు మండలాలుగా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం నాలుగు నెలల కాలంలో 50 శాతం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైందనే కారణంగా పలు మండలాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. కానీ కనీసం 50 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగైన మండలాలను కరువు మండలాలుగా పరిగణలోకి తీసుకోవడంపై అధికారులు కూడా మౌనం వహిస్తున్నారు. ప్రధానంగా పత్తిపాడులో 37 శాతం, వట్టిచెరకూరులో 44, పెదనందిపాడులో 29, మేడికొండూరులో 55, ఫిరంగిపురంలో 58 శాతం మాత్రమే సాగైంది. వీటితో పాటు గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, తుళ్లూరు. తాడేపల్లి, తాడికొండ మండలాల్లో 75 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగైనట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఐదు మండలాలో వర్షపాతం తక్కువగానే ఉన్నా ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథంతో అంచనాలు రూపొందించలేదనే విమర్శలు వచ్చాయి. అక్టోబరులో 129.4 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 16.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే వర్షాభావం ఉన్నా డెల్టాలోవరి సాగుకు అవసరమైన మేరకు నీటి సరఫరా అయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక వల్ల కరువు మండలాల ప్రకటన జరగలేదని తెలిసింది. వర్షాభావం వల్ల జిల్లాలో పత్తి, మిర్చి పైర్లకు వర్షాభావం వల్ల బెట్టకు వచ్చాయి. మెట్ట ప్రాంతంలోసాగర్‌ కాల్వలకు నీరు రాకపోవడం వల్ల ఈ పైర్లపరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని సాగర్‌ కాల్వలకు చివర ఉన్న దాదాపు 50 గ్రామాల్లో పైర్లు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. 45 వేల ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లోమిర్చి పైర్లను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మిర్చికి అధిక పెట్టుబడి పెట్టడం వల్ల మొక్కలను బతికించుకునేందుకు చెరువులు, కుంటల్లో ఉన్న నీటిని కడవలతో తీసుకువచ్చి వినియోగిస్తున్నారు. అక్టోబరులో తుపాన్లు వస్తాయని చాలామంది మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చి, ఇతర పంటలను సాగు చేయగా ఈనెలలో ఇప్పటి వరకు వర్షం లేకపోవడం వల్ల పైర్లను బతికించుకునేందుకు ఎంతో ప్రయాసపడుతున్నారు. జూన్‌, జులై, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురిసినా ఆగస్టు, అక్టోబరులో కనీస వర్షపాతం లేక రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌ సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.