Nov 03,2023 21:06

కూర్మరాజుపేటలో నీరులేక ఎండిపోతున్న వరిపంట

సాలూరు: కరువు తరుము కొస్తున్నా జిల్లా వ్యవసాయ, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. చేతికి అంది వచ్చే సమయంలో పంట బుగ్గిపాలవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి చూసి అన్నదాతల గుండె చెరువు అవుతోంది. ఖరీఫ్‌ సీజన్లో వరిసాగుకు ఎకరాకు రూ.20వేలు చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు ఆందోళనలో వున్నారు. అక్టోబరు నెలలో పడాల్సిన సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో మండలం లోని 6వేల ఎకరాల భూములు బీడుగా మారుతోంది. ఇప్పటికే మండలంలో తాజా పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు నివేదించారు. వారం రోజుల్లో ఆఖరి తడి అందకపోతే వరి పొలాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం వుందని నివేదించారు. పాచిపెంట మండలంలోని కర్రివలస ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా నీరు కోస్టువలస వరకు వస్తోంది. ఈ నీటిని సాలూరు మండలం కొత్తవలస పాండీ చెరువుకు చేరేలా కాలువ పూడికతీత పనులు చేయిస్తే కరువు నివారణ చేయొచ్చునని రైతులు వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ, పెద్దగెడ్డ ఇరిగేషన్‌ అధికారులు పంట భూములు, ఇరిగేషన్‌ కాలువ పరిస్థితిని పరిశీలిం చారు. కానీ ఇంతవరకు ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్న దాఖలాల్లేవు. ప్రత్యామ్నాయ చర్యలపై అన్నదాతల ఆశలు అడుగంటి పోతున్నాయి. యుధ్ధప్రాతిపదికన కాలువ పూడికతీత పనులు చేయిస్తే గాని ఎండిపోయిన వరి పొలాలకు నీటితడి అందే అవకాశం లేదు. ఫలితంగా కూర్మ రాజుపేట, చంద్రప్పవలస, దేవుబుచ్చింపేట, పిఎన్‌ బొడ్డవలస, బంగారమ్మపేట, కొత్తవలస గ్రామాల్లో పొలాలు పూర్తిగా ఎండి పోయే దశకు చేరుకున్నాయి.
కలెక్టర్‌ రూ.10 లక్షలిస్తే పూడిక తీత పనులు
మండలంలో కరువు కోరల్లో చిక్కుకున్న వరి పొలాలకు నీటితడి అందే అవకాశం పరిశీలించిన ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌కు తాజా పరిస్థితిని నివేదించి కాలువ పూడిక తీత పనులు చేపడతామని పెద్దగెడ్డ ఎఇ సంధ్య చెప్పారు. ఆమె చెప్పి ఐదు రోజులవుతున్నా అడుగు ముందుకు పడిన దాఖలాల్లేవు. 200మీటర్ల పొడువున్న కాలువ పూడిక తీత పనులు చేపడతే కరువు ఎదుర్కొంటున్న గ్రామాల చెరువులకు నీరు చేరుతుందని రైతులు ఆశతో ఉన్నారు. కానీ ఆ ఆశలు అడియాసలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టర్‌ తక్షణమే నిధులు మంజూరు చేసి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొనేలా ఇరిగేషన్‌ అధికారులను అప్రమత్తం చేయాలని రైతులు కోరుతున్నారు.