
ప్రజాశక్తి - చిలకలూరిపేట : కరువు, నిరుద్యోగం తాండవిస్తుంటే, ధరలు విపరీతంగా పెరుగుతుంటే ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా? అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ నిలదీశారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా, మంగళవారమే కర్నూరులు జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడినా ముఖ్యమంత్రికి పట్టడం లేదని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో రెండోరోజైన బుధవారమూ కొనసాగింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. గఫూర్ మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి ధ్యేయంగా సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్ర చేపట్టిందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు సిద్ధమైందని, దీనికితోడు రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరాన్ని పూర్తి చేయలేదని, అయినా వైసిపి, టిడిపి ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలేవీ సిఎం చేపట్టలేదని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించారని, రాజధానిని లేకుండా చేశారని, పరిశ్రమలు రాలేదని, రాష్ట్ర అభివృద్ధిపై జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధే లేదని విమర్శించారు. అధికారం కోసం జగన్ - చంద్రబాబు పోట్లాడుకుంటుంటే వారితో కలిసి పవన్ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని, రాష్ట్రానికి ద్రోహం చేసే ఇలాంటి చర్యలు మానుకుని కేంద్రంలోని బిజెపిపై సాగే పోరాటంలో కలిసి రావాలని సూచించారు. ఇందుకోసం ఆ పార్టీలపై ప్రజలు ఒత్తిడి తేవాలని, అందులో భాగంగా ఈనెల 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు భారీగా తరలిరావాలని కోరారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ ఏడాదికి 20 శాతం చొప్పున మద్యాన్ని తగ్గిస్తామని ఎన్నికలప్పుడు చెప్పిన వైసిపి ఇప్పుడా మాటను తప్పిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో మద్యం వాటా రూ.16 వేల కోట్లు ఉండేదని, ఇప్పుడది రూ.23,500 కోట్లకు పెరిగిందని విమర్శించారు. పంటలకు మద్దతు ధరలు దక్కక నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, మరోవైపు కందిపప్పు కిలో రూ.170కు పెరిగిందని, ఇదే తరహాలో నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయని చెప్పారు. అయితే జనం ఆదాయాలు మాత్రం పెరగలేదని అన్నారు. డ్వాక్రా మహిళల డబ్బులను వైసిపి నాయకులు వాడుకోవడం సిగ్గుచేటని, ఈ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి తన రాజకీయ అవసరాల కోసం ఈడి, సిబిఐ, ఐటిలను వాడుకుంటోందని, అదాని, అంబాని అడిగింది ఇవ్వకపోతే ఆ సంస్థల ద్వారా దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు. బిజెపి దురాగతాల నుంచి రాష్ట్రాల హక్కులను నిలబెట్టుకోవాలని, జనం పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన వై.రాధాకృష్ణ మాట్లాడుతూ యడవల్లి, మురికిపూడి తదితర గ్రామాల్లో సుమారు 700 ఎకరాలను దళితుల వద్ద నుండి లాక్కున్నారని, దీనిపై పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు తాండవిస్తుండగా 13 మండలాల్లోనే కొద్దిగా కరువు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమని అన్నారు. ఇప్పటికే పనుల్లేక కూలీలు, పేదల వలసలు పెరిగాయని, ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించడంతోపాటు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది పత్తి దిగుబడి ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి రాదని, ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు నష్టాల బాటలో ఉన్నారని అన్నారు. రైతులకు రూ.20 వేల పరిహారం ఇస్తామని తన మేనిఫెస్టోలో టిడిపి చెబుతోందని, అయితే అందులో కౌలురైతులు ఉన్నారా? అని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్షాలు ప్రచారం కోసం ఇళ్లకు వచ్చే సందర్భంలో ఈ సమస్యలన్నింటిపైనా ప్రజలు నిలదీయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, దయా రమాదేవి, కె.ఉమామహేశ్వరరావు, భాస్కరయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్, కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.కాళిదాసు, బి.శంకరరావు, టి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.