
ప్రజాశక్తి-నక్కపల్లి:వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో వరి చేను ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు ఆరంభించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. మండలంలోని ఉద్దండపురంలో శనివారం రైతులతో కలిసి ఎండిపోయిన వరినారు మడులు, ఉడిచిన వరి నాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో 2023 ఖరీఫ్ లో 2.04 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు నమోదు కావాల్సి వుండగా, నేటికి 1.13 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు నమోదయ్యాయని, ఇందులో ప్రధానంగా వరి సాగు విస్తీర్ణం 1.36 లక్షల ఎకరాలకు 91,777 వేల ఎకరాల్లో వరి సాగైందని, నక్కపల్లి మండలంలో 5,125 ఎకరాలలు సాధారణ విస్తీర్ణం కాగా, కేవలం 1250 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయన్నారు.వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాగైన వరిలో అధికభాగం పంట ఎండిపోతోందన్నారు. ఉడుపులకు పనికిరానంతగా వరి ఆకు ఎండిపోయిందన్నారు. జలాశయాల మరమ్మతులు, నిర్వహణ చేయక పోవడంతో వాటి పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించలేని పరిస్థితివుందని,తాండవ, పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల కింద 75వేల ఎకరాల వరి ఆయకట్టులో 48,447వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగైందన్నారు.జిల్లాలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు సాధారణ వర్షపాతం 564.5 మిల్లీమీటర్లు నమోదుకావాల్సివుండగా, 489.5 మిల్లీమీటర్లు నమోదయిందని,24 మండలాల్లో 10 మండలాల్లో వర్షపాతం లోటువుందన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా ఆయా ప్రాంత పరిస్థితులను ఆధారంగా స్పల్ప కాలిక పంటలకు అవసరమైన విత్తనాలు విరివిగా రైతులకు ఉచితంగా అందజేయాలని కోరారు. చెక్ డ్యాంలు, గేట్లు మరమ్మత్తులు చేపట్టాలని, కాలువల్లో తుప్పలు, పూడికలు తీయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పి.నానాజీ, టి.లక్ష్మణరావు, ఎం.సాయిబాబు, పి.జమీలు, పి.బాబూరావు, కె.శ్రీను, పి.ఆనందరావు, పి.సూరిబాబు, పి.అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.