కరువు శాశ్వత నివారణకు వేదవతిని నిర్మించడమే
సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు నియోజకవర్గ కరువు శాశ్వత నివారణకు వేదవతి రిజర్వాయర్ నిర్మాణమే పరిష్కారం అని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్.రాధాకృష్ణలు పేర్కొన్నారు. మంగళవారం ఆలూరు జ్యోతిబసు భవన్‌లో మైన అధ్యక్షతన మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా పశ్చిమ ప్రాంతంలో వర్షాధార పంటలను పండిస్తున్న రైతులకు సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి నాశనం అవ్వడం, తాగేందుకు నీరు లేకపోవడం, సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల కొరకు శాశ్వత కరువు నివారణ కొరకు గూళ్యం గ్రామం నందు ప్రవహించే వేదవతి నది రిజర్వాయర్‌ను నిర్మిస్తే 80 వేల ఎకరాలకు సాగు నీరు, 253 గ్రామాలకు తాగునీరు అందించవచ్చు అన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ ద్వారా 2007లోనే 8 టిఎంసిలతో రెండు రిజర్వాయర్‌లు నిర్మిం చాలని అప్పటి ప్రభుత్వానికి నివేదికలు పంపినామన్నారు. ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని, గత టిడిపి ప్రభుత్వంలో రూ.1925 కోట్లతో వేదవతి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఇప్పటి ప్రభుత్వం నిధులను కుదించి 3.5 టిఎంసిలతో రెండు రిజర్వాయర్‌లు నిర్మిస్తామని రూ.1600 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపిందన్నారు. రిజర్వాయర్ నిర్మించే మెఘ కంపెనీకి రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులెత్తేసిం దన్నారు. నియోజకవర్గానికి అన్ని వనరులు ఉన్న ఉపయోగించుకోలేని ప్రభుత్వాలు, పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం వేదవతి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి 8 టిఎంసిలతో రిజర్వాయర్ నిర్మించి ఆస్పరి మండలానికి కూడా సాగు, తాగునీరు అందించాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు పి.హనుమంతు, కెపి. నారాయణస్వామి, మండల నాయకులు షాకీర్, ఈరన్న, నాగరాజు, రత్నమ్మ, మైన, గోవర్ధన్ పాల్గొన్నారు.










