Nov 14,2023 22:18

మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

* రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
* శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలి
* ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ఇచ్ఛాపురం మొదలు హిందూపురం వరకు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గుండ లకీëదేవి, బగ్గు రమణమూర్తితో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులకు తోడు సాగునీరు అందించడంలో జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు తిట్ల పురాణం, వ్యక్తిగత అంశాలపై శ్రద్ధ, చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు తప్ప సాగునీటిపై దృష్టిసారించిన దాఖలాల్లేవన్నారు. ప్రాజెక్టులపై ఏనాడైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క పంట కాలువలోనైనా తట్టెడు మట్టి తొలగించిన దాఖలాల్లేవన్నారు. రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయో, రైతుల సాగు కష్టాలు ఏమిటో వ్యవసాయశాఖ మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. జిల్లాలో వంశధార, నాగావళి నదుల ఆయకట్టు ప్రాంతంలో నాట్లు వేసి పెట్టుబడులు పెట్టిన రైతాంగానికి సాగునీరందక ఈ ఏడాది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వర్షపాతం తక్కువ ఉంటుందని ముందు నుంచీ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. వర్షాబావ పరిస్థితులు నెలకొన్న సమయంలో పంట నష్టపోకుండా రైన్‌ గన్స్‌, స్ప్రింకర్లు టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు అందజేశామన్నారు. రాష్ట్రంలో 400కి పైగా మండలాలు కరువుతో అల్లాడుతుంటే, 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి జగన్‌ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని విమర్శించారు. జగన్‌ వైఖరి తిత్లీ తుపాను విధ్వంసంలోనే చూశామన్నారు. పక్క జిల్లాలో ఉండీ జిల్లా రైతులను పరామర్శించేందుకు రాలేదని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పంటలు నష్టపోతే బయటకు వస్తాడని ఎలా భావిస్తామన్నారు. పంటలు పోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే, వారి బాధలు పట్టించుకోని మంత్రులు బస్సు యాత్ర పేరుతో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఆ యాత్రలో కనీసం రైతుల గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. వైసిపి జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్తే చెప్పుతో కొట్టే పరిస్థితి ఉందని తెలిసి, అధికారులను ముందు పెట్టుకుని గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్నారని చెప్పారు. కరువు పరిస్థితులతో అల్లాడుతున్న శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆ ప్రకటన చేశాకే ఈనెల 23న సిఎం జగన్‌ జిల్లాలోకి అడుగు పెట్టాలన్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు, స్పీకర్‌ జిల్లాలో ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించుకోలేకపోయారని, రైతులపై వారి చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేస్తోందన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు మాదారపు వెంకటేష్‌, ఎస్‌.వి రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.