
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేస్తున్న పంటల పరిస్థితిపై జిల్లా కలెక్టర్, అధికారులతో చర్చించామని, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. జిల్లాలో తుఫాను కారణంగా వర్షాలు కురుస్తాయని ఆశించామని, మరికొద్ది రోజులపాటు వర్షాలు లేనట్లయితే 30శాతం మేరకు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం వుందని అధికారులు వివరించారని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం అప్రమత్తంగా వుందని, పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని అన్నారు.
పొరపాట్లు పునరావృతం కానివ్వం
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా గత ఏడాది సిరిమాను ఊరేగింపులో జాప్యం జరిగిందని, ఈ ఏడాది అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశించామని మంత్రి చెప్పారు. జాతీయ స్థాయి డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు