Sep 02,2023 22:02

ఎండిపోయిన పంటను పరిశీలిస్తున్న రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.బాలాజీరావు, టి.భాస్కరరావు, బి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని నారాయణపురం, కూర్మనాథపురం, కొల్లిపాడు, కొండూరు, బొడ్డపాడు, సీతాపురం, బెండి తదితర గ్రామాల్లో పర్యటించి నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించారు. నెల రోజులుగా వర్షాల్లేక, వంశధార కాలువ ద్వారా చివర భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని నాయకుల వద్ద రైతులు వాపోయారు. వంశధార ఎడమ కాలువ 60 ఆర్‌ఎల్‌ 5 ఎల్‌ బెండి కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో కాలువ మొత్తం గుర్రపుడెక్క, తూటికాడతో నిండిపోయిందని చెరుకుపల్లి వద్ద కాలవ గట్టు పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడం, మర్లపాడు రైల్వే ట్రాక్‌ వద్ద మట్టి పేరుకుపోవడంతో ఈ కాలువకు నీరు రావడం లేదన్నారు. కాలువ మరమ్మతు చేయాలని అధికారులకు అనేకసార్లు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మండలంలో వేలాది ఎకరాలు పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని, అనేక గ్రామాల్లో నాట్లు కూడా వేయలేదన్నారు. వంశధార ఎడమ కాలువ ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టాల్సి ఉన్నా వెయ్యి క్యూసెక్కులు కూడా విడిచిపెట్టడం లేదన్నారు. ఎడమ కాలువ నీటి సామర్థ్యం పెంచకుండా కాలువపై 13 లిఫ్టులు ఏర్పాటు చేయడంతో దిగువకు నీరు రావడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలువ మరమ్మతులు చేయాలని, ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ, హేమంత్‌, ధర్మారావు, రామారావు, చిట్టిబాబు తదితరులున్నారు.