ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల : సత్తెనపల్లి, ముప్పాళ్ల మండలాలను కరువు మండలంగా ప్రకటించి రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, సత్తెనపల్లి, ముప్పాళ్ల మండలాల కార్యదర్శులు పి.మహేష్, జి.బాలకృష్ణ డిమాండ్ చేశారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర సత్తెనపల్లి మండలంలోని భట్లూరు, గోరంట్ల, కట్టమూరు గ్రామాల్లో, ముప్పాళ్ల మండలంలోని పలుదేవర్లపాడు, నార్నెపాడు గ్రామాల్లో బుధవారం కొనసాగింది. సత్తెనపల్లి మండలంలో పాదయాత్ర బృందానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను వివరించారు. పనుల్లేక ఇళ్ల వద్దే ఉంటున్నామని, మరోవైపు ధరల పెరుగుదలతో కుటుంబ జీవనం కష్టంగా మారిందని పలువురు వాపోయారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలకు వడ్డీ మాఫీ చేయాలని కోరారు. డ్రెయినేజీ సదుపాయం కల్పించాలన్నారు. అర్హుల్లో కొందరికి పింఛన్లు రావడం లేదని, రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు అందలేదని పలువురు రైతులు తెలిపారు. వ్యవసాయ పనులు లేని నేపథ్యంలో ఉపాధి హామీ పనులు కల్పించాలని విన్నవించారు. ఒక్క యూనిట్ విద్యుత్ వాడుకోకున్నా రూ.200 బిల్లు వస్తోందని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని పలువురు కోరారు. జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంకా జారీ చేయలేదని, కార్డులున్నవారికి సంక్షేమ బోర్డు నుండి నిధులు రావడంలేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులింకా మంజూరు కాలేదన్నారు. ఈ సమస్య లన్నింటిపైనా అధికారులు, ప్రజాప్రతి నిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరి ంచారు. కార్యక్రమంలో నాయకులు టి.పెద్దిరాజు, వి.తులసిరామ్, ఆర్.పూర్ణ చంద్రరావు, అమూల్య, కె.సాయికుమార్, డి.తాతారావు, వి.కోటేశ్వరరావు, సుజాత, అనూష, లక్ష్మి, సత్యవతి, బి.వెంకటేశ్వర్లు, సుబ్బారావు, గణేష్ పాల్గొన్నారు.
ముప్పాళ్ల మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుయాత్ర బుధవారం నాలుగో రోజుకు చేరింది. ఏపూరి గోపాలరావు, జి.బాలకృష్ణ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టులో నీటి విడుదల లేకపోవడంతో పంటల్లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కొందరు రైతులు ఆడపాదడప వర్షాలతోనే మిర్చి, పసుపు సాగు చేశారన్నారు. వీరితోపాటు మొక్కజొన్న ఇతరత్రా పంటలు సాగు చేసేందుకు ఎదురు చూస్తున్న రైతుల పరిస్థితి డోలాయ మానంగా మారిందని, ఈ నేపథ్యంలో నీటి విడుదలపై ప్రభుత్వం ప్రణళిక సిద్ధం చేసి నీటిని విడుదల చేయాలని కోరారు. మండలాన్ని కరువు మండలంగా గుర్తించి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జి.జాలయ్య, కె.సాంబశివరావు, కె.ప్రభాకర్, ఎన్.సాంబశివరావు, ఐ.లింగయ్య, శ్రీను, ఎం.వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, పి.సైదాఖాన్, సిహెచ్.నాగమల్లేశ్వరరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










