Nov 07,2023 22:18

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు

 కడప సాగుచేసిన పంటలు వర్షాభావం వల్ల ఎండు దశకు చేరుకుంటున్నాయని, ఈ పరిస్థితులను ప్రభుత్వం గమనించి ఒక కమిటీ వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాముడు అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో సరాసరి వర్షపాతం జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు (-)34 వరకు ఉందన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్‌ 4 ద్వారా 103 మండలాలు మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి కడప జిల్లాను విస్మరించిందని పేర్కొన్నారు. తక్షణమే కడప జిల్లాలోని 36 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దళితులపై వైసిపి మరో కొత్త నాటకానికి తెరదేసిందన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా , సామాజికంగా కాంగ్రెస్‌ హయాంలోనే ఎదిగారని తెలిపారు. ఈనెల 8న రైతులు, ప్రజా సమస్యలపై ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు విష్ణుప్రితమ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ, నగర మహిళ అధ్యక్షులు లావణ్య పాల్గొన్నారు.
'గుండ్లకుంట'కు సన్మానం
ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గుండ్లకుంట శ్రీరాములను మంగళవారం ముదిరాజ్‌ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు టి. వెంకటేశ్వరరావు, పి.ఆర్‌.వి. ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గుండ్లకుంట శ్రీరాములను శాలువా, పూలమాలతో సత్కరించి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ముదిరాజ్‌ సంక్షేమ సంఘం బలోపేతానికి కషి చేయాలని, ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.