Nov 04,2023 21:30

వర్షాభావంతో ఎండిపోయిన వరిపంటను పరిశీలిస్తున్న సిపిఎం ప్రతినిధి బృందం

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లాలోని పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో పూర్తిస్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కావున ఆ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. అలాగే మిగిలిన మండలాల్లో పంచాయతీలు వారి కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు శనివారం సిపిఎం బృందం పార్వతీపురం మండలం డోకిశీల రెవెన్యూ పంచాయతీలో పరిధి గల తాళ్లబురిడి, గోచెక్క తదితర గ్రామాల్లో పర్యటించింది. వర్షాభావంతో ఎండిపోయిన వరిని, పొట్ట దశకు వచ్చి పాడైపోయిన పంటను దెబ్బతిన్న పంటలను బృందం పరిశీలించింది. బుచ్చింపేట, డోకిశీల గ్రామాల రైతులు బలుసు శంకర్రావు, బలుసు రమేష్‌, గౌరీ శంకర్రావు పార్వతి, ఏ రాజు సాగుచేసిన వరి పంట పూర్తిగా నీరు లేక ఎండిపోయిందని తెలిపారు. ఈ ప్రాంతంలో వర్షాధారంతో వరి నాట్లు తప్ప కాలువ సౌకర్యం లేదు. దీంతో మండలంలో సుమారు 70శాతం వరి నాట్లు పంట దశకు వచ్చి దెబ్బ తిన్నాయని, తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. గతంలో సిపిఎం పరిశీలించిన గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో సగం భూమిలో వరి నాట్లు కూడా పడలేదు, నాట్లు వేసినవి కూడా ఇదే స్థాయిలో వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయి కరువుకు గురయ్యాయి. కావున ఈ మండలాలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పరిశీలించి పూర్తిస్థాయిలో కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. జిల్లాలో తీవ్ర వర్షాభావంతో మిగిలిన మండలాల్లో భామిని, వీరఘట్టం, పాలకొండ, సీతానగరం, గరుగుబిల్లి తదితర మండలాల్లో పంచాయతీ స్థాయిలో వర్షాభావంతో వరి నాటుమళ్లు దెబ్బతిన్నాయన్నారు. పంచాయతీల వారి కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయ పంటలకు ఏర్పాట్లు చేయాలని, జిల్లాలో సాగునీటి సౌకర్యం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, జంఝావతి పూర్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో మినీ రిజర్వాయర్లు, చెక్‌ డ్యాములు నిర్మించి సాగునీటి వనరులకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పై ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించే వరకూ సిపిఎం పోరాడుతుందని, జిల్లా రైతులంతా పోరాటం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశీలన బృందంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పి.రాము, రైతులు ఎ.రాజు, బి.రమేషు, ఎస్‌ బాల తదితరులు ఉన్నారు.