Sep 06,2023 23:00

మాట్లాడుతున్న మాధవరావు

ప్రజాశక్తి- పలాస: వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు పూర్తిస్థాయిలో వేయలేదు, వేసిన వరి నాట్లు ఎండిపోతున్నాయి, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని కరువు మండలాలుగా గుర్తించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబరు కావస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో 75 శాతం మాత్రమే వరి నాట్లు వేశారని, వంశధార, నాగావళి, బహుద పరివాహక ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల వరి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కొన్నిచోట్ల ఎదలు వేసిన సాగునీరు లేక నారు మడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్నిచోట్ల పంట భూములు బీట్లు వారుతున్నాయని, ఎండుతున్న నారు మడులు చూసి రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు. మందస మండలం శంకు జోడు కళింగదాల, డబార్సింగ్‌ వంటి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఆయకట్టు రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా పనులు చేపట్టడం లేదన్నారు. పలాస డివిజన్‌ లో సగటు కంటే వర్షపాతం బాగా తక్కువగా నమోదవడంతో కరువు పరిస్థితులు కనబడుతున్నాయని, దీన్ని దష్టిలో పెట్టుకొని కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు భైరి కుర్మారావు, మామిడి భీమారావు, ఐఎఫ్‌టియు నాయకులు జుత్తు వీర, సోమేశ్వరరావు పాల్గొన్నారు.