Nov 02,2023 20:54

సమావేశంలో మాట్లాడుతున్న ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి

 కడప అర్బన్‌ : జిల్లాలో కరువు మండలాలు ప్రకటించకపోతే ఆందోళన తప్పదని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎపి రైతు సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో కరువు మండలాలు ప్రకటించాలని గురువారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో కరువు మండలాల పట్ల ముఖ్య మంత్రికి ఏమాత్రం కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు మండలాలు ప్రకటించాలని ప్రజాప్రతినిధులు ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం చెందారని విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే ఈరోజు కొంతవరకైనా కరువును నివారిం చవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ పాలకులు నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ జిల్లాలో కరువు విలయతాండం చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ 103 కరువు మండలాలు ప్రకటిస్తే కడప జిల్లాలో ఒక్క కరువు మండలం కూడా లేకపోవడం దుర్మార్గమని తెలిపారు. జిల్లాలో 36 మండలాలలో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేనాటికి తీవ్ర వర్షా బావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయని, జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కరువు మండ లాలను ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రబీ సీజన్‌ ప్రారంభమైందని ఇప్పటి వరకు వర్షమే కురవలేదని తెలిపారు. పంట పొలాలన్నీ బీడు భూములుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు కోరల్లో కడప జిల్లా చిక్కుకుందని, రైతులకు భరోసా ఇచ్చేలా జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామాలలో పర్యటించాలని కోరారు. ఎండిపోయిన పంటలకు తక్షణమే ఈ క్రాప్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతాంగానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కరువు సహాయక చర్యలు , కరువు మండలాలు ప్రకటించకపోతే రానున్న కాలంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన, పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్‌, టిడిపి రాష్ట్ర నాయకులు లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తార్‌, బిస్‌పి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. గురప్ప, కెసి కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌. చంద్రశేఖర్‌ రెడ్డి, అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ్డి, రైతు సంఘం సీనియర్‌ నాయకులు బి.నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌, జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్‌ శివారెడ్డి, రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎ.వి.రమణ, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు రమణయ్య, సిఐటియు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మనోహర్‌, నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.