ఒంటిమిట్ట : ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, వెంటనే కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నరసయ్య తెలిపారు. బుధవారం ఒంటిమిట్టలో అడగంటిన చెరువును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితితో రైతులు అరకొర పంటలు వేశారని తెలిపారు. అప్పులు చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన పంటలు ఎండు దశకు వచ్చాయని చెప్పారు. పత్తి, వేరుశనగ, మిర్చి, మొక్కజొన్న, ఆముదం, కంది, మినుము వంటిపంటలు కూడా సకాలంలో వర్షాలు లేక సగానికి సగం దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. బోరు బావుల కింద ఉన్న అరకొర పంటలను కాపాడుకుందామంటే విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడం లేదని విద్యుత్ కోతలతో ఉన్న కొద్దిపాటి పంటలు దెబ్బ తింటుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ప్రణాళిక లేమితో చోద్యం చూస్తోందన్నారు. కనీసం వేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ-క్రాప్ నమోదు చేయటంలో కూడా సర్వర్, నెట్‌వర్క్ ప్రాబ్లం, యాప్ డౌన్లోడ్ కాకపోవడం వంటి కారణాలతో పంటల నమోదు సక్రమంగా చేయటం లేదని తెలిపారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న అన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటను బట్టి ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలు వేయని రైతులకు ఎకరాకు రూ.20 వేలు జీవన భతిగా ఇవ్వాలన్నారు. రైతులు, కౌలు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు కౌలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకంలో అదనంగా 100 రోజులు పనులు పెట్టాలన్నారు. వ్యవసాయ మోటర్లకు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందించి ఉన్న పంటలను కాపాడాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను రూపొందించి రబీలో పంటలు వేసేందుకు 90 శాతం సబ్సిడీతో రైతులకు ప్రభుత్వం విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమశిల వెనుక జలాల ద్వారా ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని నింపి చెరువు ఆయకట్టు రైతులను కాపాడాలన్నారు. పై సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీన తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రాము, నాయకులు వెంకటసుబ్బారెడ్డి, నరసయ్య, రవి పాల్గొన్నారు.










