కడప ప్రతినిధి : ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాకు మొండిచేయి చూపించింది. అధికార యంత్రాంగం జిల్లాలోని 36 మండలాల్లో 17 మండలాలను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసి ప్రతిపాదనలు అందజేసింది. ప్రభుత్వం కరువు మండలాల ఎంపికకు అనుసరించిన కేంద్ర ప్రభుత్వ ఆధారిత ఏడు పారామీటర్లలో భాగంగాలోటు వర్షపాతం, సాగు విస్తీర్ణం, నీటిపారుదల శాఖ, భూగర్భజలాల తగ్గుదల, ఉపాధి హామీ, పశుగ్రాసం, తాగునీటి కొరత ప్రాతిపదికన కరువు మండలాలను ఎంపిక చేసినట్లు సమాచారం. జిల్లాలోని 36 మండలాల్లో ఏ ఒక్క మండలాన్ని ఎంపిక చేయడం పట్ల విమర్శల వర్షం కురుస్తోంది. అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలోని 30 మండలాల్లో 23 మండలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు అందజేసింది. ఇందులో 18 మండలాలను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసింది. మిగిలిన ఐదు మండలాలు కరువు పీడిత మండలాలుగా ఎంపిక చేయకపోవడం గమనార్హం. అన్నమయ్య జిల్లాలో ఎంపిక చేసిన మండలాలను పరిశీలిస్తే గాలివీడు, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, పీలేరు, టి.సుండుపల్లి, వీరబల్లి, తంబళ్లపల్లి, పెద్దమండెం, కురబలకోట, పెద్దతిమ్మసముద్రం, బి.కొత్తకోట, నందలూరు, పెనగలూరు మండలాలను ఎంపిక చేసింది.
కనికరం లేని ముఖ్యమంత్రి : ఎపి రైతు సంఘం
కడపఅర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ 103 కరువు మండలాలు ప్రకటిస్తే కడప జిల్లాలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. దస్తగిరి రెడ్డి తెలిపారు. బుధవారం ఎపి రైతు సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప పాత బస్టాండ్ దగ్గర నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 36 మండలాలలో ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయని, జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కరువు మండలాలను ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వర్షాభావ విపత్తుతో వేసిన పంటలు ఎండు దశకు చేరుకున్నాయని సన్న, చిన్న కారు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రబీ సీజన్‌కు రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నా చినుకులు పడలేదని తెలిపారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామాలలో పర్యటించాలని కోరారు. ఎండిపోయిన పంటలకు తక్షణమే ఈ క్రాప్ చేయాలని డిమాండ్ చేశారు. కరువు కోరల్లో చిక్కిన రైతాంగాన్ని అన్ని విధా లుగా ఆదుకోవాలని పేర్కొన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యలు, కరువు మండలాలు ప్రకటించకపోతే పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్య క్షులు గోపాలకష్ణయ్య, జిల్లా నాయకులు రంగారెడ్డి, చిన్న సిద్దయ్య, శ్రీనివాస్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు రామ్మోహన్, సుబ్బమ్మ, శ్రీనివాసులు రెడ్డి, చంద్రారెడ్డి, శివకుమార్, ఓబులేష్ పాల్గొన్నారు.