
కరువు మండలాల ప్రకటనలో అన్యాయం
- రాష్ట్రం మొత్తం 400 మండలాలను ప్రకటించాలి
- కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.మార్క్
ప్రజాశక్తి - నంద్యాల
కరువు మండలాల ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కౌలు రైతు సంఘం. జిల్లా అధ్యక్షులు ఎస్.మార్క్ పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని స్థానిక నరసింహయ్య భవనంలో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన 400 మండలాలల్లో కరువు ఏర్పడిందని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 మండలాలు మాత్రమే కరువుగా ప్రకటించిందని అన్నారు. ఇది పూర్తి అన్యాయమన్నారు. సాగునీరు అందక వందలాది మంది రైతులు వలసలు పోయే పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తుందని విమర్శించారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిపై ఏ మంత్రివర్గ సమావేశంలోనూ మాట్లాడడం లేదన్నారు. రైతులపై కనికరం చూపడం లేదని తెలిపారు. రైతుల నడ్డి విరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. 2011 చట్టం ప్రకారం భూ యజమాని సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని, 2019 చట్టం వచ్చాక భూ యజమాని సంబంధంతో కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని తెలిపారు. ఒకవైపు సాగునీరు అందక, కెసి కెనాల్ నీళ్లు రాక, మరోవైపు ప్రకృతి వైపరిత్యాల వలన ఎదురుదెబ్బలు తగులుతుంటే రైతులను పట్టించుకునే నాధుడు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేడు కనబడుతుందన్నారు. ఇప్పటికైనా రైతులపై కనికరం చూపి కౌలు రైతులు, రైతులు వలసలు పోకుండా ఆదుకోవాలన్నారు. అన్ని మండలాలను కరరువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం.నరసింహులు, సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు ఏలియా, ఓబులేసు, భాస్కర్, సుగుణమ్మ, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.