Nov 02,2023 21:00

దత్తిరాజేరు మండలంలో నీరులేక ఎండిపోతున్న వరిచేలు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎటు చూసినా ఎండిపోయిన పంట పొలాలు, బీటలు వారిన భూములతో కరువు దుస్థితి కళ్లముందు కదిలాడుతోంది. అయినప్పటికీ, మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల బాధలు, ఇబ్బందులు, ఆందోళన కరమైన దుస్థితి కనిపించలేదు. నిబంధనల బూచీ అడ్డు రావడం వల్ల అధికారులు కూడా కరువు నివేదికలు పంపలేదు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల జాబితాలో ఉమ్మడి జిల్లాల్లో 20 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా గుర్తించకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. విజయనగరం జిల్లాలో ఖరీఫ్‌లో అన్ని పంటలూ కలిపి 3,09,834 ఎకరాల్లో సాగు కావాల్సివుండగా, నీటి ఎద్దడి కారణంగా అతికష్టం మీద 2,80,738 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 2,31,835 ఎకరాల్లో సాగైంది. ఆ తరువాత స్థానంలో 30, 581 ఎకరాల్లో సాగయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు ఉన్నాయి. కానీ, వర్షపాతం నెలవారీ హెచ్చుతగ్గుల వల్ల సమయానికి నాట్లు పడలేదు. మొక్కజొన్న, పత్తి, అపరాలు సహా అన్ని పంటల సాగూ తగ్గింది.
కొంపముంచిన వర్షపాతం
సీజన్‌ ముగిసేనాటికి (జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) సాధారణ వర్షపాతం కావడంతో కరువు ప్రాంతంగా గుర్తించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. జూన్‌లో 52 మీల్లీ మీటర్ల మేర లోటు వర్షపాతం నమోదు కావడంతో నారుపోసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. జులైలో 82 మి.మీటర్ల వర్షం అధికంగా కురవడంతో నారుపోత పూర్తయింది. ఆగస్టులో 24 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. దీంతో, చెరువులు, కాలువలు, వాగుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఇంజన్ల ద్వారా తోడుకొని ఆ నెలాఖరు వరకు ఉబాలు పట్టారు. నాట్లు ఆలస్యం కావడంతో అక్టోబర్‌ ప్రారంభం నాటికి ముఖ్యంగా వరి వెన్నుకట్టడం, అక్కడక్కడ పొట్ట దశల్లోకు వచ్చాయి. పుష్కలంగా నీరందాల్సిన ఈ సమయంలో తీవ్ర నాటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్టోబర్‌లో 178.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా కేవలం కేవలం 22.7 మి.మీ మాత్రమే పడింది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని మండలాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి కనిపిస్తోంది. వరితోపాటు మొక్కజొన్న, పత్తి తదితర పంటలన్నీ ఎండిపోతున్నాయి.
సాగునీటి వనరులు లేవా?
ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులేవీ లేవు. నదులు, జీవగెడ్డలు రాష్ట్రంలో మరెక్కడా చెరువులు ఉన్నప్పటికీ వాటిని నిర్వహణ పాలకులు పూర్తిగా గాలికి వదిలేశారు. తోటపల్లి, జంఝావతి, ఆండ్ర, తాటిపూడి, పెదంకలాం, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్‌, ఒట్టిగెడ్డ, మడ్డువలస జలాశయాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఏటా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జలాశయాల కింద నీరు విడుదల చేస్తూ హడావుడి చేయడం తప్పా తరువాత పట్టించుకోవడం లేదు.
సాధారణ వర్షపాతం ఏమైపోయిందంటే..
కొన్ని దశాబ్ధాలుగా అధికార, ప్రతిపక్షాలు జిల్లాపై చూపిన నిర్లక్ష్యం వల్ల వర్షపు నీరంతా వృథాగా సముద్రం పాలవుతోంది. ఉన్న కొద్దిపాటి నీరు కూడా పంటపొలాలకు చేరే విధంగా పిల్లకాలువల నిర్మాణం, పూడిక తీత లేదు. దీంతో, సాధారణ వర్షపాతం నమోదైనా పాలకుల పుణ్యమా అని వినియోగంలోకి రాకుండానే పోతోంది. దీనికితోడు వర్షాన్ని కొలిచే రైన్‌ గేజులు కూడా జిల్లాలో తగినన్ని లేవు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్ల అదే మండలంలో చినుకు కూడా రాలని గ్రామాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉనికిలోకి రావడం లేదు.
భౌతిక పరిస్థితులను పట్టించుకునేదెవరు?
కరువు జిల్లా లేదా మండలంగా గుర్తించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ, ప్రత్యేకమైన భౌతిక పరిస్థితుల వల్ల కరువు కాటకాలకు గురైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు కరువు జిల్లాల జాబితాలో లేకుండా పోయాయి. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ప్రసంగాలు ఊదరగొట్టిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కూడా అటువంటి తీర్మాణం చేసి, ప్రభుత్వానికి నివేదించేందుకు ప్రయత్నం చేయలేదు.
సాగునీటి కాలువల కిందా అంతే సంగతులు
జలాశయాల నిర్వహణ గురించి ప్రభుత్వానికి పట్టకపోవడంతో సాగునీటి కాలువల కింద కూడా పూర్తిస్థాయిలో ఉబాలు కాలేదు. అష్టకష్టాలు పడి ఉబాలు పట్టినప్పటికీ ఇప్పుడు నీరందించుకోలేని దుస్థితి. ఈ ఏడాది తోటపల్లి జలాశయం ద్వారా 78,563 ఎకరాలకు సాగునీరు అందించాల్సివుండగా 53,574 ఎకరాలకు సాగునీరు మాత్రమే అందినట్టు సాక్షాత్తు ప్రాజెక్టు అధికారులు సెలవిస్తుండడం ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.
50శాతం పంటలు ఎండిపోయినట్టే
మొత్తం పంటల విస్తీర్ణంలో ఇప్పటికే 50శాతం ఎండిపోయింది. ముఖ్యంగా వరి లక్ష ఎకరాల్లో ఎండుతోంది. మరో 10వేల ఎకరాల్లో మొక్కజొన్న దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఇంకో 10వేల ఎకరాల వరకు పత్తి, అపరాలు, చిరుధాన్యాలు, అపరాలు సాగు దిబ్బతినే ప్రమాదం ఉంది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఎండిన పంటలను పరిశీలించినప్పటికీ విస్తీర్ణాన్ని తక్కువ చూపుతుండడం గమనార్హం.
కరువు ప్రతిపాదన పంపలేదు
కరువు ప్రతిపాదనేమీ ప్రభుత్వానికి పంపలేదు. కొంత వరకు పంటలు ఎండిన మాట వాస్తవమే. కానీ, ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. వరుసగా 21రోజులపాటు వ్యవధి ఉండాలన్న నిబంధన కూడా మన జిల్లాకు వర్తించే పరిస్థితి లేదు. అక్టోబర్‌లో వర్షాలు పడలేదు. సెప్టెంబర్‌ 30 నాటికి ఉన్న పరిస్థితిపై నివేదిక పంపించాం. అప్పటి పరిస్థితిని బట్టి కరువు నిబంధనలు వర్తించే పరిస్థితి లేదు. దీంతో కరువు ప్రాంతంగా గుర్తింపు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
- వి.టి రామారావు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి