Nov 01,2023 23:31

నందిగాం మండలం బోరుభద్రలో వరి చేనులో ఆవులను మేతకు వదిలేసిన రైతు

* వేలాది ఎకరాల్లో ఎండిపోయిన వరి
* వర్షాభావ పరిస్థితుల్లో 59 వేల ఎకరాల్లో పంటలు వేయని రైతులు
* జాబితాలో జిల్లాకు దక్కని చోటు
జిల్లాలో ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలైలో కొంతవరకు వర్షాలు పడినా ఆగస్టు, సెప్టెంబరులో నెలల్లో అనుకున్న మేర వానలు పడలేదు. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు వేయలేకపోయారు. పంటలు వేసినా ఆ తర్వాత వర్షాలు లేక ఎండిపోతున్నాయి. అక్టోబరు నెలలో కనీసం చినుకు చుక్క కూడా రాల్లేదు. దీంతో జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. నిబంధనల పేరిట కరువు పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం వాటిల్లింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాను చేర్చకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: 
ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వెంటాడిన వర్షాభావ పరిస్థితులు చివరి దాకా సాగాయి. సీజన్‌లో కురవాల్సిన స్థాయిలో వర్షం పడలేదు. తొమ్మిది మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. పలాస డివిజన్‌లోని ఆరు మండలాలు తీవ్ర వర్షపాతం లోటు జాబితాలో ఉన్నాయి. వర్షపాతం ఫలితంగా ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో పంటల సాగు జరగలేదు. రాగులు, పెసలు, గోగు వంటి పంటల సాగు నాలుగో వంతు కూడా రైతులు వేయలేకపోయారు. నువ్వు పంటను ఒక్క ఎకరాలోనూ విత్తనాలు పడలేదు.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 4 లక్షల 37 వేల 165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 3,81,833 ఎకరాల్లో (87 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు, 3,39,588 ఎకరాల్లో (85శాతం) సాగైంది. మొక్కజొన్న పంటను ఈ సంవత్సరం 26,375 ఎకరాల విస్తీర్ణం వేయాలని అనుకోగా, 23,633 ఎకరాల్లో (90శాతం) వేశారు. పత్తి పంటను 4620 ఎకరాల్లో వేయాలను కోగా, 2,763 (60శాతం) మేర వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా, 1470 ఎకరాలు (32 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించు కోగా ఇప్పటివరకు 93 ఎకరాలు (28 శాతం) మేర సాగవుతోంది. వేరుశెనగ 1333 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా, ప్రస్తుతం 328 ఎకరాల్లో (25శాతం) వేశారు. మినుములు 273 ఎకరాల్లో రై తులు విత్తనాలు వేస్తారని అంచనా వేయ గా, ఇప్పటి వరకు 70 ఎకరాల్లో (26 శాతం) వేశారు. ఈ సంవత్సరం 165 ఎకరాల్లో సజ్జలు వేయాల్సి ఉండగా, 58 ఎకరాలు (35శాతం) వేశారు. నువ్వు పంటను 98 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఒక ఎకరాలోనూ వేయలేదు.
పలు రకాల పంటలు 20 శాతంలోపే...
ప్రస్తుత ఖరీఫ్‌లో 253 ఎకరాల్లో పెసలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 20 ఎకరాలు (11 శాతం), రాగులు 145 ఎకరాల్లో రైతులు వేస్తారని అంచనా వేయగా, 20 ఎకరాల్లో (14 శాతం) వేశారు. గోగు పంటను ఈ సంవత్సరం 258 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా తీసుకోగా, 48 ఎకరాల్లో (18శాతం) వేశారు.
ఏడు మండలాల్లో కరువు ఛాయలు
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణంగా 696.44 మి.మీ నమోదయ్యే పరిస్థితి ఉండగా, 699.27 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో 0.41 శాతం అదనంగా వర్షం కురిసినా, జిల్లా అంతటా ఆ పరిస్థితి లేదు. జిల్లాలో ఏడు మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉంది. వాటిలో కవిటి (35.5 శాతం), కంచిలి (34.5శాతం), ఇచ్ఛాపురం (34శాతం), సోంపేట (31.3శాతం), టెక్కలి (24.5శాతం), వజ్రపుకొత్తూరు (23.5శాతం), మందస (14.5శాతం) మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. జిల్లాలో ఈ పరిస్థితి ఉన్నా... ఒక్క మండలం కూడా కరువు జాబితాలో చోటు కల్పించలేదు.
నిబంధనల పేరిట రైతులకు అన్యాయం
వర్షాభావ పరిస్థితులు నెలకొనడం తో రైతులు 59, 162 ఎకరాల్లో వరి పంట వేయలేదు. అధికారుల లెక్కల ప్రకారం మరో 15 వేల ఎకరాల్లో పంట ఎండిపోయిందని చెప్తున్నారు. మొత్తం మీద 74 వేల ఎకరాల వరకు రైతులు నష్టపోయారు. కరువు జాబితా ప్రకటన కు సంబంధించి ప్రభుత్వం రూపొందిం చిన మార్గదర్శకాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంటల సాగు 70 శాతం కంటే తక్కువ ఉండటం, నీటి లభ్యత, భూగర్భ జలాలు, వలసలు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకు ని జిల్లా యూనిట్‌గా లెక్కలు తీసుకోవ డంతో 70 శాతం కంటే తక్కువ ఉన్న మండలాలుకూ జాబితాలో చోటు దక్కలేదు. కరువు నిబంధనల్లో పేర్కొన్న అంశాలకనుగుణంగా జిల్లాలో పరిస్థితు లు ఉంటేనే ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం సూచించడంతో జిల్లా వ్యవసా యశాఖ అధికారులు కనీసం ప్రతిపాదన లూ పంపలేదు. మొత్తం మీద జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నా జాబితాలో చోటు కల్పించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.