
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నడూ లేని విధంగా పల్నాడు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఏర్పడిన తీవ్ర వర్షాభావం ప్రభావంతో 28 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో 25 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్టు జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా స్పందన లేదు. 25 మండలాల్లో సగటు వర్షపాతం నమోదు కాలేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో కాల్వల నుంచి తాగునీటికి తప్ప సాగునీటికి నీటిని విడుదల చేయలేదు. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం కంటే మూడు లక్షల ఎకరాల్లో ఏ పంటా వేయకుండా భూములు ఖాళీగా ఉంచినా ప్రభుత్వం కరువు పరిస్థితులను గుర్తించలేదు. ఇప్పటికే వేసిన పంటలు బెట్టకు వచ్చాయి. మాగాణి భూములు నెర్రెలిచ్చాయి. పత్తి బెట్టకు వచ్చింది. దిగుబడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి తీతకే అంతంతమాత్రంగా వచ్చిన దిగుబడులు రెండో తీతకు అవకాశాలు తగ్గుతున్నాయి.
అక్టోబరులో కురవాల్సిన వర్షంలో కనీసం 20 శాతం కూడా నమోదు కాలేదు. మిర్చి, వరి, పత్తి, కందిపంటలకు నీరు పెట్టుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు పొలాల్లోనే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల కాలంలో సగటు కనీస వర్షపాతం నమోదు కాలేదు. సెప్టెంబరులో కొంత మెరుగ్గా ఉన్నా అక్టోబరులో కనీస వర్షపాతం 116.77మిల్లీ మీటర్లు కాగా కేవలం 20.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అయినా ప్రభుత్వం పల్నాడు జిల్లాలో ఏ ఒక్క మండలాన్ని కరువు మండలంగా గుర్తించలేదు. ఖరీఫ్‌లో మొత్తం విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు 50 కంటే తక్కువగా సాగు అయ్యాయి. ఉద్యాన పంటల సాగుకూడా గణనీయంగా తగ్గింది. మొత్తంగా 3లక్షల ఎకరాల్లో ఎటువంటి పంటలు వేయలేకపోయారు. సాగర్ జలాశయానికి ఈ ఏడాది ఎగువ నుంచి నీరు రాలేదు. సాగైన పంటల్లో కూడా దిగుబడి 50 శాతం కంటే తక్కువగా రావచ్చునని అధికారులు అంచనా వేశారు. దీంతో అన్ని మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికపై జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.
గతేడాది కంటే ఈ ఏడాది వర్షపాతం 28మండలాలకు 25 మండలాల్లో 50 శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు నివేదికలు ఇచ్చారు. పత్తి, వరి, మిర్చి, కంది పంటలు దిగుబడి గణనీయంగా తగ్గుతుందని వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. నేలలో తేమ తగ్గిపోతోంది. అన్నిరకాల పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రభుత్వం తగిన అధ్యయనం చేయలేదు. పల్నాడు జిల్లాలో లక్షా 12 వేల ఎకరాలకు గాను కేవలం 28 వేల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. జిల్లాలో మొత్తం 6.80 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేస్తారని అంచనా కాగా ఇప్పటి వరకు 3.80 లక్షల ఎకరాల్లోనే వివిధ రకాల పంటలను సాగు చేశారు. పత్తి 1.54 లక్షల ఎకరాలు, మిర్చి 1.24 లక్షల ఎకరాలు, కంది 40 వేల ఎకరాలు,వరి 28 వేల ఎకరాలు, ఇతర పంటలు మరో 34 వేల ఎకరాల్లో సాగు అయ్యాయి. ఖరీఫ్‌లో ఏ పంట వేయని 3 లక్షల ఎకరాల్లో రబీ పంటలు వేయాలన్న రైతుల సంకల్పం నెరవేరలేదు. అక్టోబరులో తీవ్ర వర్షాభావం వల్ల జొన్న, మొక్కజొన్న సాగు చేయడానికి కూడా అవకాశాలు సన్నగిల్లాయి. పల్నాడు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోలేదు. ఇంత వరకు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు గత రెండు నెలలుగా ఈ అంశంపై చర్చించలేదు.