Sep 26,2023 00:34

వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి- కె.కోటపాడు
అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనిబాబు మాట్లాడుతూ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు పరిహారం అందించాలని, పంట రుణాలు రద్దు చేయాలని, స్వల్పకాలిక పంటలకు అవసరమైన విత్తనాలు ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దారు రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు ఎర్ర దేవుడు, గొర్ల మహేష్‌, వనము సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి : యలమంచిలి మండలంలో వర్షపాతం తగిన స్థాయిలో కురువనందున కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, పెంజెరువు దిగువ ఆయకట్టు రైతులు ఉడుపులే లేక పొలాలు బీడుబారుతున్నాయని ఈ పరిస్థితులు సమీక్షించి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, తక్షణం నష్టపరిహారం చెల్లించాలని జిల్లా రైతుసంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు సోమవారం తహశీల్దారు రాణిఅమ్మాజీకి వినతిపత్రం అందజేశారు. రైతులకు, కూలీలకు ఉపాధి కల్పించాలని, నీరు పారడానికి అడ్డంకులు సృష్టిస్తున్న గేట్లు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పెంజరువు కింద పాక్షికంగా ఉడుపులు జరిగినా, 70 రోజులు దాటిన ముదురు ఆకు ఉడవడం వలన దిగుబడి రాదని, తక్షణం రైతులకు నష్టపరిహారం ఎకరాకు కనీసం రూ.20వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు నగరెడ్డి సత్యనారాయణ, ఆడారి ఆదిమూర్తి, రమణబాబు పాల్గొన్నారు.