ములకలచెరువు : సకాలంలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని బురకాయలకోట, వేపూరికోట, దేవులచెరువు గ్రామాల్లో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో వర్షాలు రాక పంటలు సాగు చేయక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. సాగు చేసిన రైతుల పంటలు ఎండి నష్టపోయారని తెలిపారు. వర్షాలు సకాలంలో రాకపోవడంతో రైతులు సాగు చేయలేకపోయారని వివరించారు. అక్కడక్కడా సాగు చేసిన పంట కూడా జులై ఆగస్టు నెలలో వర్షాలు రాక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ ఊడలు దిగే సమయంలో వర్షం రాకపోవడంతో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందన్నారు. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా పెసర, ఉలవలు, సజ్జ, ఆముదం, జొన్న, అనుములు, కొర్రలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు నారాయణస్వామి, గోపాల్, నారాయణ, వెంకటరమణ, రవి, నరసింహులు, అంజి పాల్గొన్నారు.










