
* సాగునీరందించడంలో ప్రభుత్వ వైఫల్యం
* 10న రైతుగర్జన, బిసి సభ
* డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కరువు పరిస్థితులతో అల్లాడుతున్న శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతితో కలిసి మాట్లాడారు. ఒడిశాలో కురిసిన వర్షాల వల్ల వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో పుష్కలంగా నీరున్నా, జిల్లాలో రైతాంగానికి సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వంశధార కుడి కాలువలో గడిచిన ఐదేళ్లుగా పూడికతీత పనులు చేపట్టలేదని, కాలువకు ఇరువైపులా 12 ఏళ్లుగా షట్టర్లు లేకపోవడం వల్ల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతుందని తెలిపారు. నాట్లు వేసిన పంటకు సాగునీరు సకాలంలో అందకపోవడం, వర్షాబావ పరిస్థితుల వల్ల సాగు దెబ్బతిందన్నారు. వర్షాభావంతో రైతులు అల్లాడిపోతుంటే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కంచిలి, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస తదితర మండలాల్లో వరిపంట పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రాజెక్టుల దిగువ ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కరువు మండలాల గణనలో, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంలో జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈనెల పదో తేదీన రైతు గర్జన, బిసి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, సిడబ్ల్యుసి వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు, ఎన్.రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు. జిల్లాలోని రైతులు, బిసిలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు సనపల అన్నాజీరావు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూషణరావు, మధుసూదనరావు, డి.గోవింద మల్లిబాబు, రెల్ల సురేష్, తెంబూరు మధుసూదనరావు, కె.వి.ఎల్.ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.