ప్రజాశక్తి-శృంగవరపుకోట : విజయనగరం జిల్లా కరువుకోరల్లో చిక్కుకున్నందున కరువు ప్రాంతంగా ప్రకటించాలని సిపిఎం జిల్లాకార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని వెంకటరమణ పేట గ్రామ పొలాల్లో నీరు లేక ఎండిపోయిన వరిచేలను సిపిఎం నాయకులు గాడు అప్పారావు, మద్దిల రమణ తదితరులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట పెట్టుబడులు,సాగునీటి సమస్యలపై తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మెడకు ఉరితాళ్లు వేసుకొని పొలాల్లో నిరసన తెలిపారు.అనంతరం తమ్మినేని మాట్లాడుతూ. ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం, వ్యవసాయశాఖ మొదలగు అధికార యంత్రాంగ వైఫల్యమే పంట నష్టాలకు కారణమని అన్నారు. వర్షాధారం మీద పండే వాటిని ఏమీ చేయలేమని, వర్షాలు ఉండి, కాలువలు ఉండి నీరందలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొందని అన్నారు. సిపిఎం నాయకుల బృందం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తోందని, కొత్తవలస, ఎల్. కోట, వేపాడ మండలాల్లో 80 నుండి 90శాతం వరకు పంటలు ఎండిపోగా ఎస్.కోట మండలంలో 60 నుంచి 70శాతం నష్టం సంభవించిందని అన్నారు. అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని అన్నారు. సిపిఎం బందం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి 303 కరువు మండలాలను గుర్తించగా రాష్ట్ర ప్రభుత్వం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇందులో విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక్క మండలం కూడా లేకపోవడం అన్యాయమని అన్నారు. రైతు ఒక ఎకరాకు సుమారు రూ.25వేలు నుంచి 30 వేలు పెట్టుబడి పెట్టారని, రైతు కష్టంతో కలిపి పంట నష్టానికి ఒక్కొక్క ఎకరానికి రూ.50వేలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోవడానికి మరో కారణం చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికావడమేనని, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల వైఖరివల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. పంటలు పండేందుకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపించకపోగా ఉన్న వాటిని కబ్జాలు చేస్తున్నారని అన్నారు.
జిల్లాలో 4 లక్షల 75 వేల ఎకరాలలో వరి నాట్లు వేయాల్సి ఉండగా 4 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట వేశారని. దీంట్లో 60 నుంచి 70శాతం వరకు జిల్లాలో పంట నష్టం సంభవించిందని. కాబట్టి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వెంకట రమణ పేట రైతులు పాల్గొన్నారు.