Nov 13,2023 21:59

పంట పొలాలను పరిశీలిస్తున్న గుండ లక్ష్మీదేవి

ప్రజాశక్తి - గార: వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా, రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి విమర్శించారు. మండలంలోని అంపోలు పంచాయతీ పరిధిలో పంట పొలాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంశధార నదిలో నీరున్నా రైతాంగానికి ఈ ఏడాది సాగునీరందలేదని, ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. వంశధార కుడి కాలువ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరందించాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. కాలువల్లో పూడికతీతకు నిధులు ఇవ్వకపోవడం వల్ల శివారు ప్రాంతాలకు సాగునీరు అందలేదని విమర్శించారు. గతంలో శివారు ప్రాంతాలకు సాగునీరు విడుదల చేసిన తర్వాత చెరువుల్లో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేకుండా పోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో గార మండల రైతాంగానికి సాగునీరందించేందుకు రూ.2.75 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు చేసి 75 శాతం పూర్తి చేసినా, మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేయకుండా వైసిపి ప్రభుత్వం మధ్యలో విడిచిపెట్టిందని విమర్శించారు. దీనివల్ల రైతులకు సాగునీరు అందకుండా పోయిందన్నారు. తక్షణమే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అంబటి చక్రధర్‌, పొట్నూరు కృష్ణమూర్తి, జల్లు రాజీవ్‌, వెలమల శ్రీనివాస్‌, రుప్ప ముసలినాయుడు, వెలమల రమణ తదితరులు పాల్గొన్నారు.