Nov 01,2023 23:28

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా నియోజకవర్గం తుని మండలంలో 6,750 ఎకరాల్లో సాధారణ విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల రైతులు కేవలం 3 వేల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేశారు. ఇప్పుడు సాగునీరు లభ్యత సక్రమంగా లేకపోవడంతో వేసిన పంట కాస్తా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు.
పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లూరు లిఫ్ట్‌ పరిధిలో జగ్గంపేట మండలంలోని సుమారు 30 వేల ఎకరాల్లో వరి పూర్తిగా ఎండిపోయిందని వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఇలా జిల్లాలో మెట్ట ప్రాంతంలో పలుచోట్ల పంటలు ఎండిపోయి నష్టం తప్పేలా లేదని అనేకమంది గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా, సాగునీటి లభ్యత లేకున్నా కరువు మండలాలుగా ప్రకటించడం లేదు. మెట్ట మండలాల్లో పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా మారాయి. వచ్చే రబీ సీజన్‌లో ఒక్క సెంటులో కూడా నాట్లు పడే అవకాశం లేదు.
జిల్లాలో 21 మండలాల్లో ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. గతేడాది కంటే సుమారు 10 వేల ఎకరాల్లో తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రైతులకు భారీగా నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మెట్ట మండలాలైన తుని, కోటనందురు, రౌతులపూడి, తొండంగి, జగ్గంపేట, శంఖవరం తదితర ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. ఈ ఏడాది వర్షాలు కురవక, సాగునీటి లభ్యత లేని కారణంగా ఖరీఫ్‌ బాగా ఆలస్యంగా వేశారు. వేసిన పంటలకు నీరు పూర్తిగా అండడం లేదు. జలాశయాలు అందుబాటులో ఉన్నా అక్కరకు రాని దుస్థితి ఏర్పడింది. తుని సబ్‌ డివిజన్‌ పరిధిలోని తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో అధికారిక లెక్కల ప్రకారం 39 వేల ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది ఆలస్యంగా 30 వేల ఎకరాల్లో సాగయ్యింది. తునిలో సగానికి పైగా ఏరియాలో నాట్లు పడలేదు. తొండంగి మండలంలో పిబిసి పంపా ద్వారా సాగునీరు అందుతున్నా మరో 10 రోజులు గడిస్తే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉంది. కోటనందూరు మండలంలో తాండవ నుంచి నీరు ప్రస్తుతం బాగానే వస్తుంది. మరో రెండు వారాలు గడిస్తే సాగునీటి లభ్యత బాగా తగ్గుతుంది. దీంతో పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రౌతులపూడి మండలంలో చాలావరకు తాండవ, ఏలేరు ద్వారా సాగునీరు అందుతుండగా రాబోయే రోజుల్లో లభ్యత తగ్గే అవకాశం ఉంది. శంఖవరం మండలం బాపనమ్మ చెరువు ద్వారా మరో 10 రోజులు మాత్రమే సాగునీరు అందుతుంది. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో నీటి అవసరం చాలా ఉంది. కానీ తీవ్ర వర్షాభావం వల్ల నష్టం తప్పేలా లేదు. ఈ సబ్‌ డివిజన్లో 750 ఎకరాల్లో వరి ఎండుతున్నట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నా నష్టం ఇంకా ఎక్కువ ఉండొచ్చనే అంచనా ఉంది.800 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో పత్తి వేసిన రైతులు వర్షాలు లేక పూర్తిగా నష్టపోయారు.
నిండా ముంచిన 'తాళ్లూరు లిఫ్ట్‌'
పుష్కర ఎత్తిపోతల పథకం పరిధిలోని తాళ్లూరు లిఫ్ట్‌ ఆయకట్టు క్రింద జగ్గంపేట మండలం రాజుపూడి, మల్లిశాల, మన్యంవారి పాలెం తదితర గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో వరి ఎండిపోతుందని పశువులు వేయడానికి కూడా పనికిరాకుండా పోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవల ఆందోళన నిర్వహించిన అన్నదాతలు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. నష్టపోయిన వారిని గుర్తించి ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఒకపక్క వర్షాలు లేక మరోవైపు ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందని పరిస్థితుల్లో రైతులు సంక్షోభంలోకి కూరిపోయారు.
అధికారుల సన్నద్ధత ఏదీ.?
ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్ధితుల నేపథ్యంలో మెట్ట ప్రాంత మండలాల్లో కీలక దశలో ఉన్న పంటలను కాపాడేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తుని, ప్రత్తిపాడు, తొండంగి, జగ్గంపేట, కోటనందూరు మండలాల్లో కాలువల కింద, వర్షాధారంగాను రైతులు సాగు చేసిన పంటలు సాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దృష్ట్యా రెవెన్యూ, వ్యవసాయ, సాగునీటి శాఖల అధికారులు ఈ మండలాల్లో పర్యటించి పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కానీ అటువంటి చర్యలు ఏమీ కనిపించడం లేదని పలువురు రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర కాలువపై ఆక్రమణలను, అవరోధాలను తొలగించాలని ఆదేశించినా పరిస్థితుల్లో మార్పులు లేవు.
లోటు వర్షపాతం
ఏడాది జూన్‌ నెల నుంచి జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతుంది. జూన్‌ నెలలో 112.8 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 60.1 మిల్లీ లీటర్లు మాత్రమే నమోదయ్యింది. జూలైలో బాగానే ఉన్నా ఆగస్టులో 61.1 లోటు వర్షపాతం, సెప్టెంబరులో 18.1 లోటు వర్షపాతం, అక్టోబరులో 88 లోటు వర్షపాతం నమోదైంది.