* సాగు అంతంతమాత్రమే
* నత్తనడకన ఈ-క్రాప్
* దిగజారుతున్న అన్నదాత పరిస్థితి
అప్పుడప్పుడు... అక్కడక్కడా చిటపట చినుకులు పడి చుట్టం చూపుగా పలుకరించి వెళ్లిపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కారుమబ్బులు వారానికి రెండు, మూడుసార్లు కమ్ముతున్నా ఆ స్థాయిలో వర్షం కురవకపోవడంతో ఆశతో ఎదురుచూసిన అన్నదాతలు ఉసూరుమంటున్నారు. అడపాదడపా పడిన వర్షంతో దమ్ములు పట్టి వరినాట్లు వేయలేక... అలా అని మౌనం వహించలేక సంకట పరిస్థితిలో పడిపోతున్నారు. కళ్లముందే కాలం కరిగిపోతుండడంతో కర్షకుల మదిలో కల్లోలం ప్రారంభమైంది.
ప్రజాశక్తి - కవిటి: ఖరీఫ్ కష్టాలు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చుక్క నీరు లేక అన్నదాత కంటనీరు పెడుతున్నాడు. కనీసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి ఏదో విధంగా సాగు చేద్దామని ప్రయత్నించిన వీరి ఆశలను వరుణుడు ఆడియాసలు చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. మరికొందరి నారుమడులు పశువుల మేతగా మారుతున్నాయి. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో చుక్క నీరు కోసం అన్నదాత ఆతతగా ఎదురుచూస్తున్నాడు.
సాగు అంతంతమాత్రమే...
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 33,331 ఎకరాల సాగుభూమికి కేవలం 16,731 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కంచిలి మండలంలో కేవలం 7.3 శాతం వ్యవసాయ భూమిలో మాత్రమే నాట్లు వేయగా, సోంపేటలో 20 శాతం, ఇచ్చాపురంలో 20.1 శాతం వ్యవసాయ భూమిలో నాట్లు పడ్డాయి. ముఖ్యంగా సాగునీటి సదుపాయం లేకపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వ్యవసాయం కష్టమవుతోంది. ఇప్పటికే ఆగస్టు నెల పూర్తికావస్తున్నా వరినాట్లు పడకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాభావ పరిస్థితులతో...
గత ఏడాదిగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతాంగ వ్యవస్థపైనే తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో వ్యవసాయ, ఉద్యాన పంటలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. అక్కడక్కడా బోరు నీటితో సాగుచేసినా ఫలితం లేకపోతోంది. దీంతో రైతులు తీవ్రమైన ఒత్తిడికిలోనవుతున్నారు.
ఈ-క్రాప్ సమస్యలు
మరోవైపు ఈక్రాప్ సమస్యలు అటు ఉద్యోగుల్ని, ఇటు రైతుల్ని పీడిస్తున్నాయి. సర్వర్లో సమస్యలో లేకా నెట్‌వర్క్ సమస్యలో కానీ నియోజకర్గస్థాయిలో కేవలం 4,935 ఎకరాల్లో మాత్రమే ఈ-క్రాప్ జరిగిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తోంది. స్థానిక సచివాలయ సిబ్బంది ఈ-క్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సచివాలయం సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సాగు భారంగా మారింది
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ భూమి సాగు చేయడం భారంగా మారుతోంది. నేను ఎకరా భూమి కౌలుకు తీసుకొని సాగు చేశాను. ఇప్పటివరకు రూ.18 వేలు ఖర్చు చేశాను. మరో వారం, పది రోజులు ఇదే వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంట ఎండిపోవడం ఖాయం. అదే జరిగితే మరోసారి కౌలుకు తీసుకోవడానికి వెనుకడుగు వేయక తప్పదు. ఏదేమైనా వ్యవ'సాయం' కరువవుతోంది. సాగు భారమవుతోంది. - నర్తు లోకనాధం
కౌలు రైతు, రామయ్యపుట్టుగ










