Jan 10,2021 07:27

ఎవరన్నారు అన్నదాతలు అసంఘటితులని.. ఎవరన్నారు    రైతులు పొలాల్లోనే విసిరేసినట్లుంటారని.. ఎవరన్నారు కర్షకులకు పంటలు పండించడం మాత్రమే తెలుసని.. తమ జోలికొస్తే తమకు చేటు తెస్తే సంఘటితులై సత్తా చాటుతారని.. కృషీవలురు దేశ రాజధాని నలుదిశలా రహదారులను ఏకబిగిన రోజుల తరబడి దిగ్బంధించి, పోరు సల్పుతున్నారు. కంకులు కోసే చేతులనే వినాశకర వ్యవసాయ చట్టాలను రుద్దిన బిజెపి ప్రభుత్వంపై పిడికిళ్లయి ఎత్తారు. మట్టి పిసుక్కునే చేతులతోనే కొత్త సాగు చట్టాల మాటున రైతుల రక్తాన్ని పీల్చేందుకు ఆవురావురంటున్న కార్పొరేట్‌ జలగలకు సవాలు విసురుతున్నారు. ఏదో ఒకటీ రెండు రాష్ట్రాలకు, మహా అయితే ఉద్యమం ఢిల్లీ సరిహద్దులకు పరిమితమవుతుందని మరుగుజ్జు తలంపులతో మభ్యపెట్ట జూసిన మోడీ ప్రభుత్వానికి రోజులు గడుస్తున్నకొద్దీ అన్నదాతల పోరు 'ఆసేతు హిమాచలం' విస్తరిస్తున్న వైనం, ఉద్యమానికి లభిస్తున్న విశాల మద్దతు గంగవెర్రులెత్తిస్తోంది. ఢిల్లీ పీఠం కింద భూకంపం పుట్టిస్తోంది. రైతు బాగుంటేనే దేశం బాగుండేది.. రైతు లేకపోతే ఆహారమే లేదు.. రైతు గెలవాలి.. నిలవాలి.. అప్పుడే దేశానికి నిజమైన సంక్రాంతి..

 

formers protest

                                                 విధానాలు.. సంక్షోభాలు..
   రెండున్నర దశాబ్దాల సంస్కరణల శకంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆ కుదురులో డంకెల్‌ ప్రతిపాదనలు, గాట్‌, డబ్ల్యుటిఓ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఆదేశితాలు, నయా-ఉదారవాద విధానాలు పుట్టుకొచ్చాయి. అవి అడుగుపెట్టాక నాలుగు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిజెపి వచ్చాక ఏడాదికి పది వేల రైతుల బలవన్మరణాలకు ఏమాత్రం తగ్గట్లేదు. వ్యవసాయం సంక్షోభాన పయనిస్తోంది. సంవత్సరం క్రితం మొదలైన మలి విడత మాంద్యానికి కరోనా విలయం తోడైంది. ఇప్పుడు బిజెపి సర్కారు తెచ్చిన వ్యవసాయ చట్టాలు వ్యవసాయాన్ని, రైతును పూర్తిగా చంపేస్తాయి. పరిమితంగానైనా ప్రభుత్వం వద్ద ఉన్న ఎంఎస్‌పి, ఆహార సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రజలకు ధరలు పెరుగుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అసంఖ్యాక ప్రజల జీవనోపాధి ప్రశ్నార్ధకమవుతుంది. ఈ దుష్పరిణామాల తొలి వేటు రైతుపై పడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుండేది.. రైతు ఉంటేనే అన్నం తినేది.. అలాంటి రైతును రక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సమాజానిది. ప్రజలందరిదీ. అప్పుడే నిజమైన సంక్రాంతి. అన్నదాతా సుఖీభవ!!

   ది స్వాతంత్య్రానంతర అతిపెద్ద రైతు పోరాటం. పాలకుల విధానాలకు నిరసగా ఎలుగెత్తిన తిరుగుబాటు బావుటా. మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం అన్నదాతల ఉక్కు సంకల్పం అజరామరం. కరోనా విలయంతో రైతులు కకావికలం కాగా సంక్షోభానికి విరుగుడంటూ 'ఆత్మనిర్భర్‌'లో భాగంగా మూడు వ్యవసాయ అత్యయిక ఆదేశాలను (ఆర్డినెన్స్‌) గతేడాది జూన్‌ 5న మోడీ మంత్రివర్గం ఆమోదించి తక్షణం అమల్లో పెట్టింది. చట్టాల సాంకేతిక పదబంధాలేవైనా వాటిలోని అంతరసారం స్వేచ్ఛా మార్కెట్‌ ముసుగులో కార్పొరేట్లకు స్వేచ్ఛ, కాంట్రాక్టు సాగు విస్తరణ, నిత్యావసరాల మార్కెట్‌ కార్పొరేట్ల హస్తగతం. వీటికి విద్యుత్‌ సంస్కరణల యాక్ట్‌ అదనం. ఫెడరల్‌ వ్యవస్థలో అటు రాష్ట్రాలను, స్టేక్‌ హోల్డర్లయిన కర్షకులతో కేంద్రం మాటమాత్రం మాట్లాడలేదు. ఆదిలోనే తమ బతుకులను కార్పొరేట్ల చేతుల్లో పెట్టే మర్మాన్ని రైతులు పసిగట్టి ఆర్డినెన్స్‌లొచ్చిన రోజు నుంచే నిరసనలు మొదలుపెట్టారు. అవేమీ పట్టించుకోకుండా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

                                             

                                            తెగువ చూపారు.. దండు కట్టారు..

former ladies on troctors

  రైతులు చేతకానివాళ్లు, ఏం చేసినా పడి ఉంటారని సర్కారు తలచిందేమో! అయితే కర్షకులు చేతులు కట్టుకోలేదు. నవంబర్‌ 26న అఖిలభారత రైతు సమ్మె రోజున పంజాబ్‌ నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబళ్లపై చట్టం తెచ్చిన ప్రభుత్వాధీశుల చెంతకు లక్షల మంది దండు కట్టారు. హర్యానా సరిహద్దులో అక్కడి బిజెపి ప్రభుత్వం వాటర్‌ క్యానన్లు, టియర్‌గ్యాస్‌, ముళ్ల కంచెలు, సిమెంట్‌ దిమ్మలతో అడ్డుకోగా వీరోచితంగా చేధించి, హస్తిన వైపు కదిలారు. పంజాబ్‌ రైతులకు హర్యానా రైతులు తోడయ్యారు. రాజస్థాన్‌ రైతులు ఢిల్లీ వైపు నడిచారు. ఉత్తరప్రదేశ్‌ రైతులు కదం తొక్కారు. ఉత్తరాంచల్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ఇత్యాది రాష్ట్రాల రైతులు ఢిల్లీ బాట పట్టారు. మొదట సింఘు రహదారి రైతులపరం కాగా దశలవారీగా టిక్రి, ఘాజీపూర్‌, చిల్లా, పల్వాల్‌, షాహజాన్‌పూర్‌ రహదారుల్లో బైఠాయించారు. రైతులందరిదీ ఒకటే మాట 'వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, కనీస మద్దతుధరకు చట్ట బద్ధత కల్పించాలి'. చలి తమ ఎముకలను కొరుకుతున్నా, వర్షం తమను తడిపి ముద్ద చేస్తున్నా ఆ నినాదహోరు దిక్కులను పిక్కటిల్లేలా చేస్తోంది. ఉద్యమంలో 50 మంది అమరులయ్యారు. ఒకటా రెండా 500 సంఘాల కూడిక ఢిల్లీ సరిహద్దులను రణ సంద్రంగా మార్చింది. దేశంలోని 25 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతుల ఆగ్రహాన్ని గ్రహించి ఎన్‌డిఎ నుంచి పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ నిష్క్రమించి, ఆందోళనకారులతో జత కలిసింది. హర్యానాలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి జెజెపి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తోంది. రైతుల ఉద్యమానికి కార్మిక సంఘాలు మద్దతు తెలిపి కార్మిక-కర్షక మైత్రిని చాటిచెప్పాయి. నాటి 'జైజవాన్‌-జైకిసాన్‌' ముందుకొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. రోజు రోజుకూ అన్ని వర్గాల సంఘీభావం రైతు పోరాటానికి లభిస్తోంది. ఉద్యమానికి మద్దతుగా డిసెంబర్‌ 8న జరిగిన భారత్‌ బంద్‌లో 25 కోట్ల మంది పాల్గొన్నారని 'దక్కన్‌ హెరాల్డ్‌' పత్రిక అంచనా వేసింది. తొలుత పంజాబ్‌ నుంచి 'చలో ఢిల్లీ'కి బయలుదేరిన రైతుల సంఖ్య మూడు లక్షలని 'ఇండియా టుడే' రాసింది. టోల్‌ప్లాజాల రుసుముల చెల్లింపు నిరాకరణ కార్పొరేట్లను ఠారెత్తించింది. రాజకీయ ప్రమేయం లేకుండా రైతులు ప్రదర్శిస్తున్న ఉద్యమ తెగువ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రైతు పోరాట పటిమను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

 

                                                బహుళజాతి సంస్థలపైనే..

bahula jati samstalapaine..

    రైతులెత్తిన దివిటీ మోడీ హయాంలో అపర కుబేరులవుతున్న అంబానీ, అదానీ, అమాంబాపతు కార్పొరేట్ల దోపిడీపై ఎక్కుపెట్టబడింది. రైతుల గొంతు నుంచి అంబానీ-అదానీ వ్యతిరేక నినాదాలు మారుమోగడం ఉద్యమంలో కొత్త మలుపు. అంబానీకి చెందిన రిలయన్స్‌ ఫోన్‌ సిమ్‌ల బహిష్కరణ.. రిలయన్స్‌ ఫ్రెష్‌ స్టోర్స్‌ ముందు ధర్నాలు.. కార్పొరేట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొత్త చట్టాలతో దేశంలోకి ప్రవేశించి రైతులను 'భక్షించి' అపార లాభాలు పోగేసుకోవాలని తహతహలాడుతున్న అంతర్జాతీయ బహుళజాతి సంస్థలను రైతు పోరాటం అవాక్కయ్యేలా చేసింది. కార్పొరేట్‌ మీడియాను కాదని ప్రత్యామ్నాయ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు.

 

                                                  చర్చలే ఆయుధంగా..

charchale aayudamgaa

     పోరాటం వెనుక ఖలిస్తాన్‌ తీవ్రవాదులు, మావోయిస్టులు, చైనా, పాక్‌ ఏజెంట్లు, అర్బన్‌ నక్సల్స్‌ ఉన్నారన్నా.. రైతుల్లో చీలికలు పెట్టే కుటిల యత్నాలకు పాల్పడినా.. తమ పప్పులుడకవని గ్రహించిన మోడీ సర్కారు చర్చల దారి ఎంచుకుంది. ఏడెనిమిది తడవలు చర్చలు జరిపినా చట్టాల రద్దు, ఎంఎస్‌పికి చట్టబద్ధత అవి మాత్రం అడగొద్దంటోంది. ఉద్యమంలో చర్చలూ ఒక ఆయుధమన్న తంత్రంతో రైతులు ఎన్నిసార్లయినా సరేనంటున్నారు. తమ డిమాండ్లను పదే పదే వినిపిస్తున్నారు. న్యాయస్థానాల జోక్యంతో రైతు పోరాటాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే అక్కడా చుక్కెదురైంది. అన్ని సందర్భాల్లోనూ కోర్టులు ఒకే రకంగా స్పందించవనడానికి రైతులు పుట్టించిన కాక, వారి సహేతుకమైన డిమాండ్లే హేతువు. తాత్కాలికంగా చట్టాలను పక్కనబెట్టి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఉద్బోధించింది.

 

                                         సేద్య సంస్కృతిని కాపాడుకోవాలి

sedya samskrutini kapadukovali

   వ్యవసాయం మన ప్రజల జీవన విధానం. సేద్యం మన సంస్కృతి. సంస్కృతిని కాపాడతామని వీరంగం వేసే బిజెపి ఆ సంస్కృతి కర్తలైన కర్షకులను దెబ్బతీసే చట్టాలు తెచ్చింది. రామరాజ్యం అంటే రైతులు, సాగు సుభిక్షంగా వర్ధిల్లడం. రామరాజ్యం తెస్తామంటున్న బిజెపి తన చట్టాలతో రైతులను రాచిరంపాన పెడుతోంది. మనది పూర్తి వ్యవసాయ దేశం. 60 శాతానికిపైగా ప్రజానీకం పరోక్షంగా, ప్రత్యక్షంగా సేద్యపు రంగంపై ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్నారు. 20 కోట్ల మంది రైతులు 40 కోట్ల ఎకరాలను సాగు చేస్తున్నారు. మన ఆహారధాన్యాల ఉత్పత్తి 28 కోట్ల టన్నులు. మన జాతీయ స్థూలోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 16 శాతం. ప్రస్తుత మన జిడిపి విలువ రూ.170 లక్షల కోట్లు. అందులో రూ.27 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టిస్తున్నది రైతులు, వారిపై ఆధారపడ్డ వర్గాలు. బిజెపి ప్రభుత్వం రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామంటోంది. అంటే జిడిపిలో వ్యవసాయ వాటా 32 శాతానికి పెరగాలి. వారు సృష్టించే సంపద రూ.54 లక్షల కోట్లు కావాలి. ఆరేళ్లలో భారత ఆర్థికవ్యవస్థను రూ.500 లక్షల కోట్లకు తీసుకుపోతామంటున్నారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే తప్పనిసరిగా రైతుల ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగాలి. కనీసం రూ.160 లక్షల కోట్ల సంపద వ్యవసాయంలో సృష్టించబడాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతుల ఆదాయాలు పెంచే బదులు వారిని మరింత నష్టాలపాల్జేస్తాయి. ఇప్పటికే చిన్న సన్నకారు రైతులు 35 శాతం నుంచి 49 శాతానికి పెరిగారు. రైతులు ఇప్పుడున్న మార్కెట్‌ కమిటీల వద్దకు వెళ్లి పంటలు అమ్ముకోలేరని పొలం వద్దనే పంట కొనుగోలు చేసే 'ఫార్మ్‌ గేట్‌' పథకం తెచ్చారు. డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫారసు మేరకు రైతు పంట ఉత్పత్తికి చేసే ఖర్చుకు 50 శాతం కలిపి ఎంఎస్‌పి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ఎంఎస్‌పి లేదు, ఎఎంసి, ఫార్మ్‌్‌ గేట్‌ ఏమీ లేవు, రైతులు ఎక్కడైనా స్వేచ్ఛగా పంటలు అమ్ముకోవచ్చంటున్నారు. కంపెనీలకు అమ్ముకోడానికి కాంట్రాక్టులు చేసుకోమంటున్నారు. వ్యాపారులు నిత్యావసరాలను ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ చర్యలన్నీ రైతులను, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులను కార్పొరేట్ల చెంతకు చేరుస్తాయి. ప్రజలకు నిత్యావసరాల ధరలు పెరగడం అనివార్యం. ఈ సత్యాన్నే రైతులు ఎలుగెత్తి చాటుతున్నారు.

protest 1

 

protest 2

 

protest 3

 

 

protest 4

                                                      పాఠాలు నేర్వాలి !

  ప్రపంచం యావత్తూ రైతు ఉద్యమం నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి ఆ వైపు కన్నెత్తి చూడటానికి నిరాకరిస్తున్నాయి. ఎన్‌డిఎలోని మిత్ర పార్టీలే రైతులు కన్నెర్ర చేస్తే తమ అడ్రస్‌ గల్లంతవుతుందని కూటమి నుంచి వైదొలుగుతున్నారు. అలాంటిది ఎపిలోని రెండు ప్రధాన పార్టీలూ బిజెపి ప్రాపకం కోసం కావాలని రైతు ఉద్యమానికి దూరం జరుగుతున్నాయి. సందు చిక్కినప్పుడల్లా నాగలి భుజానికెత్తి ఫొటోలకు ఫోజులిచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతులకు బిజెపి ఉరితాళ్లు పేనుతుంటే మౌనంగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన జెండాలోనే 'ఇంటిపై నాగలి' పెట్టుకొని రైతు పార్టీ అనడం, వైసిపి తన పేరులోనే రైతు పేరు తగిలించుకోవడం కర్షకుల ఓట్ల కోసమేనని .. రైతుల పక్షపాతం కాదని అవి తీసుకున్న వైఖరి తెలుపుతోంది.

 

                                            నటనలోనే.. వాస్తవంలో నిల్‌..

actors

    మాజ హితం కోసం జరిగే ఏ ఉద్యమంలోనైనా సెలబ్రిటీలు తమ సంఘీభావం వ్యక్తం చేయడం పొరుగు రాష్ట్రాల్లో చూస్తాం. మన తెలుగు సినిమా హీరోలు సినిమాల్లో డైలాగులు తప్ప బయటికొచ్చి మాట్లాడరు. 'ఖైదీ నెం.150' సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి 'రైతు శక్తి ముందు కార్పొరేట్‌ శక్తి నిలవదు' అంటాడు. అల్లు అర్జున్‌ సినిమా 'బన్ని'లో శరత్‌కుమార్‌ చేత 'ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకపోతే కొంత కాలానికి రైతు అనేవాడు ఒకనాడు ఉండేవాడని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది' అని గర్జింపజేశారు. 'మహర్షి'లో మహేష్‌బాబు వ్యవసాయం చేస్తాడు. 'బిగ్‌బాస్‌' ఫేంలు, 'జబర్దస్త్‌' జడ్జీలు, శాతకర్ణీయులు ఎవ్వరికీ రైతుల గోడు పట్టదు.

కెఎస్‌వి ప్రసాద్‌
9701309927