ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మోడీ దుష్పరిపాలన నుండి రైతులను, శ్రామికులను కాపాడాలని కోరుతూ ఈనెల 30వ తేదీ విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగే కర్షక, కార్మిక రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నరసరావుపేటలోని మార్కెట్ యార్డులో కార్మిక-కర్షక సదస్సు సోమవారం నిర్వహించగా రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అధ్యక్షత వహించారు. రైతు సంఘం, కౌలురైతు సంఘం, సిఐటియు, ఎఐటియుసి, పికెఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్న సదస్సులో కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలో రైతు పోరాట సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరల చట్టం తేవాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తెచ్చి రైతులను ఆత్మహత్యల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై జరిగే సదస్సుకు జిల్లా నుండి పెద్ద ఎత్తున హాజరవ్వాలన్నారు. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, సిఐటియు జిల్లా నాయకులు డి.శివకుమారి, మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, ఇవి అమలైతే కార్మికులు బానిసలుగా మారతారని ఆందోళన వెలిబుచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి యు.రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈవూరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నూటికి 60 శాతం ప్రజల ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెడుతున్నాయని, ఐక్య పోరాటాల ద్వారా దీన్ని రక్షించుకోవాలని అన్నారు. పల్నాడులో వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేయాలని, మిర్చి రైతులకు దిగుబడి ఆధారిత బీమా అమలు చేయాలని, సిమెంటు పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో పరిశ్రమల నిర్మాణం జరిగే వరకూ ఆ భూములు సాగు కోసం రైతులకు అప్పగించాలనే డిమాండ్లను ఆమోదిస్తూ సదస్సు తీర్మానించింది. మణిపూర్‌లో హింసకాండను తక్షణమే ఆపివేయాలని, ఈ మారణ హోమానికి కారకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ తీర్మానించింది. వివిధ సంఘాల నాయకులు జి.బాలకృష్ణ, కె.రామారావు, జి.మల్లేశ్వరి, కె.ఏడుకొండలు, గుంటూరు విజయకుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. షేక్ సిలార్ మసూద్, కె.ఆంజనేయులు, వై.వెంకట్, పి.రంగయ్య, జి.పిచ్చారావు, టి.హనుమంతరావు, వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.










