పేద, బలహీన వర్గాలకు తక్కువ టారిఫ్‌తో అందించబడుతున్న విద్యుత్ సౌకర్యాన్ని మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన నిలుపుదల చేయించేందుకు పూనుకుంది. పదకొండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చట్టాన్ని తెచ్చింది. లక్షల, కోట్ల రూపాయల ప్రజాధనంతో అభివృద్ధి చేయబడిన విద్యుత్ రంగ సంస్థలను కారుచౌకగా అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టుతోంది. రైతులకు కనీస మద్దతు ధరలు ఇచ్చేందుకు ఏమాత్రం కృషి చేయలేదుగాని... ఉచిత వ్యవసాయ విద్యుత్, పేద వర్గాల గృహ విద్యుత్ రాయితీల మొత్తాలను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే నిబంధనలు మాత్రం పెట్టింది. దీని వలన ప్రత్యేకంగా మన రాష్ట్రంలో రైతాంగానికి, పేదలకు అత్యంత తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
నానాటికీ పెరిగే ఖర్చులు, గిట్టుబాటు కాని మద్దతు ధరలతో... పంట రుణాలు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు అందక... రైతులు ఇప్పటికే సతమతమవుతున్నారు. భారత రాజ్యాంగం లోని ఫెడరల్ స్ఫూర్తికి గండికొడుతూ, పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించి మరీ సన్నకారు, చిన్న, కౌలు రైతుల పాలిట ఉరితాళ్ళు కాగల మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వాటి పర్యవసానాలు అనుభవం లోకి వస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్ యార్డులను, వ్యవస్థలను నిర్వీర్యపరుస్తూ అంబానీ, రిలయన్స్, అదానీ ఫార్చ్యూన్, మెట్రో, మోర్ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు ఎమ్.ఎస్.పి తో నిమిత్తం లేకుండా ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను విధి లేక తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుస్థితి కలుగుతోంది. 175 లక్షల టన్నుల ఎఫ్.సి.ఐ. గోదాములను, 35 లక్షల టన్నుల సి.డబ్ల్యు.సి. గోదాములను ప్రైవేట్ వారికి కట్టబెడుతుండటమేకాక, రైతుల నుండి పంటలను ప్రత్యేకంగా ధాన్యాన్ని సేకరించేందుకు ఇటీవల కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చి, రైతాంగానికి అయోమయ స్థితిని కల్పించింది. దీనికి తోడు ఇప్పటికే ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని తానే కొంటానని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు అమలుకాని అనుభవాలు వున్నాయి. రబీ పంటకు సంబంధించిన పైకం నెలలు గడచిపోతున్నా అందని చేదు అనుభవముంది. ఈ పరిస్థితిలో ప్రస్తుత ఖరీఫ్ ధాన్యం అమ్మకాల గురించి రైతాంగం చాలా ఆందోళన చెందుతోంది.
రైతులకు మద్దతు ధరలు విధిగా అందాలన్న అంశం లేకుండా, రైతులకు సరైన రక్షణ కల్పించని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం వలన రైతులు తీవ్రంగా నష్టపడబోతున్నారు. నాలుగు సంవత్సరాల నాటి ధరలలో సగం ధరలకే అమ్ముకోవలసిన దుస్థితిలో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులు వున్నారు. అంతేగాక సంవత్సరాల తరబడి కొనసాగుతున్న చెరకు బకాయిలు చేదు అనుభవాలు మన ముందున్నాయి.
సరుకు నిల్వ పరిమితులను ఎత్తివేయడమేకాక, రైతుల నుండి కొన్న ధాన్యం, మినుములు, పెసలు, కందులు వంటి వాటి ధరల పైన 50 శాతం వరకు అధికంగా ధరలు పెంచుకోవడానికి కార్పొరేట్/వ్యాపార సంస్థలకు చట్టబద్ధ అనుమతి ఇచ్చినదే నిత్యావసర వస్తువుల చట్టం-2021. దీని వలన రైతులకు పిసరంత ప్రయోజనం లేకపోగా పేద, సామాన్య వినియోగదారులపై పెను భారం పడుతుంది. గత కొంత కాలంగా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్న పరిస్థితులను చూస్తూనే వున్నాం.
మోడీ ప్రభుత్వం ఒకవైపున ప్రతి బడ్జెట్లో దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల మేరకు ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్-కస్టమ్స్ సుంకాల రాయితీల ద్వారా బడా, కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తోంది. మరోవైపున మోపెడ్, స్కూటర్, మోటార్ సైకిల్ వంటివి సామాన్య ప్రజల ప్రయాణ సాధనాలన్న వాస్తవాన్ని విస్మరించి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతోంది. వంటగ్యాస్ ధరలను సైతం దాదాపు రెట్టింపు స్థాయికి తీసుకెళుతోంది.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కల్పించబడిన సాగు నీటిని తక్కువ నీటి తీరువాతో రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రైతు తన సొంత భూమిలో, సొంత ఖర్చుతో బోరులు వేసి, భూగర్భ జలాలను వెలికితీసి పంటలు పండిస్తూ దేశానికి మేలు చేకూరుస్తున్నందుననే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విధానం వచ్చింది. పేద, బలహీన వర్గాలకు తక్కువ టారిఫ్‌తో అందించబడుతున్న విద్యుత్ సౌకర్యాన్ని మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన నిలుపుదల చేయించేందుకు పూనుకుంది. పదకొండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చట్టాన్ని తెచ్చింది. లక్షల, కోట్ల రూపాయల ప్రజాధనంతో అభివృద్ధి చేయబడిన విద్యుత్ రంగ సంస్థలను కారుచౌకగా అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టుతోంది. రైతులకు కనీస మద్దతు ధరలు ఇచ్చేందుకు ఏమాత్రం కృషి చేయలేదుగాని... ఉచిత వ్యవసాయ విద్యుత్, పేద వర్గాల గృహ విద్యుత్ రాయితీల మొత్తాలను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే నిబంధనలు మాత్రం పెట్టింది. దీని వలన ప్రత్యేకంగా మన రాష్ట్రంలో రైతాంగానికి, పేదలకు అత్యంత తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి (సి2) 50 శాతం అదనంగా కలిపి, చట్టబద్ధ కనీస మద్దతు ధరలను ప్రకటిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టిన దరిమిలా అలా చేయడం సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు మోడీ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. కేంద్రం ప్రకటిస్తున్న ఎం.ఎస్.పి ధరకు చట్టబద్ధత లేకపోవడం వలన దేశంలో ఇప్పటి ధరకు కేవలం 6 శాతం మంది రైతులకు మాత్రమే ఎం.ఎస్.పి వలన ప్రయోజనం చేకూరుతోందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. స్వామినాథన్ సిఫార్సు సి2+50 శాతం అమలు కానందువలన రైతులకు ఏటా సుమారు 3 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. అందువల్లనే సంయుక్త కిసాన్ మోర్చా ఈ సిఫార్సును అమలు చేయాలని గట్టిగా పట్టుబడుతోంది.
అనేక దశాబ్దాల పాటు కార్మికులు సంఘటితంగా పోరాడి సాధించుకొన్న హక్కులకు, ప్రయోజనాలకు గండి కొడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బుట్టదాఖలు చేసి, కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా 4 లేబర్ కోడ్ లను తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఈ లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కోట్లాది ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొన్న రుణాలు, సొంత వనరులు, కార్మికులు, ఉద్యోగుల శ్రమతో, స్వేదంతో అభివృద్ధి చేయబడ్డవి ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ సంస్థలను కారుచౌకగా అదానీ, అంబాని వంటి బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. లక్షలాదిమంది విద్యార్థులతో సహా తెలుగు ప్రజలు, పోరాడి, దాదాపు 16 మంది యువకులు అమరులై సాధించుకొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిస్సిగ్గుగా అమ్మివేస్తున్నది. సుమారు 22 వేల ఎకరాలతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో వున్న మన విశాఖ స్టీల్ ప్లాంటును సుమారు 30 వేల కోట్ల రూపాయలకు అమ్మివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోంది. దేశంలో రెండవ అతి పెద్ద ఆయిల్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి.పి.సి.ఎల్) సంస్థకు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్థులుండగా సుమారు 50 నుండి 60 వేల కోట్ల రూపాయలకు అమ్మివేసేందుకు రంగం సిద్ధమౌతోంది. రైల్వేలు, జాతీయ రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు మొదలగునవి కాక పల్లెలలో, పట్టణాలలో ఖాళీగా వున్న స్కూళ్ళు-కాలేజీల స్థలాలు, సామాజిక ఉమ్మడి స్థలాలు/భూములు వంటి వాటిని కూడా 'మానిటైజేషన్' చేసేందుకు కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. ప్రజా సంపదను కొద్దిమంది అదానీ, అంబానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం చూస్తూ వుంటే ... మోడీ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని మించిపోతున్నట్టు అగుపడుతోంది. కార్పొరేట్లకు ఊడిగం చేయడంలో మోడీ ప్రభుత్వం తరిస్తూ వుంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, ముంబై ఎయిర్ పోర్టుతో సహా 6 ఎయిర్ పోర్టులను గౌతమ్ అదానీకి కట్టబెట్టిన తీరు ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. అత్యంత విలువైన అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం తరతరాలుగా జీవనం సాగిస్తున్న ఆదివాసీ ప్రజలను బయటకు గెంటేందుకు మోడీ ప్రభుత్వం అటవీ సవరణ చట్టాన్ని తీసుకురావడం అన్యాయం. కార్పొరేట్లు యథేచ్ఛగా అటవీ సంపదను...ప్రత్యేకంగా బాక్సైట్ వంటి విలువైన ఖనిజ సంపదను... దోచుకోడానికి ఈ అటవీ సవరణ చట్టం తీసుకురాబడింది.
మోడీ ప్రభుత్వం తీసుకొంటున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తున్న పౌర సంఘాలను, మేధావులను, సామాజిక ఉద్యమకారులను వేధిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ, భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది. లఖింపూర్ ఖేరి లో చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. సుప్రీం కోర్టు మందలించినా, కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, అతని అనుచరులు తుపాకులతో కాల్చారన్న వాస్తవాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీ నిర్ధారణ చేసినప్పటికీ, నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ఆ సంఘటనలో చనిపోయినప్పటికీ, ఇప్పటి వరకు యు.పి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుండి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయకపోవడం సిగ్గుచేటు. మన దేశవ్యాప్తంగానే కాక, విదేశాలలో వున్న భారతీయులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఎంతమాత్రం క్షమార్హం కాదు. అనేక విధాలుగా ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ, అసత్య ప్రచారం చేస్తున్నప్పటికి, రెచ్చిపోకుండా శాంతియుతంగా గాంధీజీ చూపిన బాటలో ఏడాదిగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు 400 రైతు సంఘాలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. లక్ష్యాలను సాధించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని చాలా స్పష్టంగా ప్రకటించి వున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలియచేయాలని సంయుక్త మోర్చా, ఆలిండియా ఐక్యవేదిక, ఆదివాసీ, యువజన, మహిళా కళాకారుల సంఘాలు పిలుపునిచ్చాయి. యావన్మంది ప్రజలు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని...తాను అనుసరిస్తున్న దుష్ట విధానాలను వెనక్కు తీసుకొనేలా మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు...నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
- వడ్డే శోభనాద్రీశ్వరరావు
( వ్యాసకర్త : సంయుక్త కిసాన్ మోర్చా ఎ.పి. కన్వీనర్ )











