ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/క్రోసూరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో కొనసాగింది. క్రోసూరు శివారు నుంచి ప్రారంభమైన యాత్రకు జనం తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నేతత్వంలో విస్తృత ఏర్పాట్లు చేయగా పలువురు కళాకారులతో లోకేశ్‌కు స్వాగతం పలికారు. 101 కలశాలతో మహిళలు లోకేష్‌ను స్వాగతించారు. క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్‌లో లోకేష్‌ను భారీ గజమాలతో సత్కరించారించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అధ్యక్షులు క్రోసూరులో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులుపెట్టి క్యాడర్‌ను భయపెట్టాలని సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారని, అన్ని గుర్తు పెట్టుకుని వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. వైసిపి నుంచి తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను జగన్ బయటకు గెంటేశాడని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేపైనా లోకేష్ విమర్శలు గుప్పించారు. పెదకూరపాడును అభివృద్ధిలో నంబర్ 1 చేస్తారని నంబూరు శంకర్రావుని జనం గెలిపిస్తే ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి తెలుసుకున్న తరువాత నంబూరు శంకర్రావును శాండ్ శంకర్ అని పేరు పెట్టానని అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇసుక రీచ్‌లన్నీ అన్ని ఎమ్మెల్యే కబ్జా చేశారని, ఈయన ఇసుక దాహానికి కృష్ణా నది ఇసుక గుంతల్లో పడి 22 మంది చనిపోయారని ఆరోపించారు. ప్రతినెలా రూ.20 కోట్లు జగన్‌కు ఇసుక వాటా పంపుతున్నారని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరకు రైతుల దగ్గర భూములు కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసారని విమర్శించారు. క్రోసూరు మండలం పెరికపాడులో సుమారు 400 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకున్నారన్నారు. అమ్మ లాంటి అమరావతిని జగన్ చంపేస్తుంటే చప్పట్లు కొట్టిన దుర్మార్గుడు శంకరరావు అని దుయ్యబట్టారు. సభలో టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేటిపాదయాత్ర వివరాలు
ఉదయం : 8 గంటలకు గార్లపాడు శివారు క్యాంప్ సౖౖెట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
8.45 గంటలకు గార్లపాడులో స్థ్థానికులతో సమావేశం
10.45 గంటలకు లగడపాడులో స్థానికులతో సమావేశం
మధ్యాహ్నం 12.15 గంటలకు పెదకూరపాడులో ఎస్సీలతో ముఖాముఖి
1.15 గంటలకు పెదకూరపాడులో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు పెదకూరపాడు నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.15 గంటలకు పెదకూరపాడు జంక్షన్‌లో రైతుులతో సమావేశం
4.20 గంటలకు పెదకూరపాడు-గుంటూరు రోడ్డులో ముస్లిములతో భేటీ
5.05 గంటలకు లింగంగుంట్లలో స్థ్థానికులతో మాటామంతి
5.50 గంటలకు పొడపాడులో వైసిపి బాధితులతో సమావేశం
6.35 గంటలకు పాదయాత్ర తాడికొండ అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం
రాత్రి 7.35 గంటలకు సిరిపురం శివారు విడిది కేంద్రంలో బస










