ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/బెల్లంకొండ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పల్నాడు జిల్లా బెల్లంకొండ, క్రోసూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. మాచయపాలెం, చండ్రాజుపాలెం, కందిపాడు, దొడ్లేరు, క్రోసూరు వరకు ప్రజలను కలుస్తూ వారి నుంచి వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలు వింటూ ముందుకు సాగారు. ఆయా గ్రామాల ప్రజలు తాగు, సాగు నీటి సమస్యలను ప్రస్తావించారు. మాచాయపాలెం క్యాంప్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పలకరించి ఫొటోలు దిగారు. మాచాయపాలెం క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో 1500 మందితో ఫొటోలు దిగారు. చండ్రాజుపాలెం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి సాగర్ కాల్వ ద్వారా తాగు, సాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఎమ్మాజీగూడెం నుండి ఎత్తిపోతల ద్వారా సాగర్ కెనాల్‌కు మళ్లిస్తే పల్నాడులో వంద గ్రామాలకు నీటి ఇబ్బందులు తప్పుతాయన్నారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. గ్రామంలోని చెరువులు, కుంటలను అభివద్ధి చేసి నీటిని నింపాలని, 50 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న చెరువు పోరంబోకు భూములపై తమకు హక్కులు కల్పించాలని విన్నవించారు. అటవీ భూముల్లోని కొంత భాగాన్ని పశువులు, గొర్రెలు మేపుకునేందుకు కేటాయించాలన్నారు. కందిపాడు గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కందిపాడు వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రోడ్డు నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు.
మధ్యాహ్నం దొడ్లేరు శివారు క్యాంప్ సైట్ వద్ద వైసిపి బాధితులతో ముఖాముఖిగా లోకేష్ మాట్లాడారు. గత నాలుగేళ్లలో 64 మందిని వైసిపి నాయకులు తమ పార్టీ కార్యకర్తలను మట్టుబెట్టారని లోకేష్ ఆరోపించారు. వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. ఇక మా ఓపిక నశించింది... చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదు.. అని లోకేష్ ఆగ్రహం వెలిబుచ్చారు.
మైలురాయిని చేరుకున్న యువగళం!
దొడ్లేరులో 2400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. తరువాత అనంతవరం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామానికి సాగర్ నీరు అందక ఆయకట్టు కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 80 ఏళ్ల పగడాల అనసూయమ్మ లోకేష్‌ను కలిశారు. సాంకేతిక కారణాలు చూపి తన పింఛను నిలిపివేశారని అన్నారు. లోకేష్ మాట్లాడుతూ సిఎం జగన్ అవ్వా, తాతల ఉసురు పోసుకుంటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలమంది వద్ధుల పెన్షన్లను రద్దుచేశారని మండిపడ్డారు.
క్రోసూరులో ఘనస్వాగతం
క్రోసూరు శివారుకు చేరుకున్న లోకేష్ పాదయాత్రకు టిడిపి నాయకులు ఘనస్వాగతం పలికారు. భారీ దండలు, బాణసంచా కాంతులతో డప్పు వాయిద్యాలతో పండగ వాతావరణంలో లోకేష్‌కు టిడిపి నాయకులు స్వాగతం పలికారు.
నేటి పాదయాత్ర వివరాలు :
సాయంత్రం 3 గంటలకు క్రోసూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.30 గంటలకు క్రోసూరు 4రోడ్ల జంక్షన్‌లో స్థానికులతో మాటామంతి
4 గంటలకు క్రోసూరు అందుకూరు రోడ్డులో బహిరంగసభ
6.40 గంటలకు అందుకూరులో స్థానికులతో సమావేశం
రాత్రి 8.20 గంటలకు గార్లపాడు శివారు విడిది కేంద్రంలో బస










